(K.Lenin,News18,Adilabad)
వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి స్నేహితులు. ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. కలిసిరాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. డబ్బు సంపాదన కోసం పక్కదారిపట్టారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నక్సలైట్లమని చెప్పుకుంటు ఎయిర్ గన్(Air Gun)లతో బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ ఫేక్ నక్సలైట్ల ప్లాన్ బెడిసి కొట్టడంతో చివరకు మంచిర్యాల(Mancherial)జిల్లా పోలీసులు నకిలీ నక్సలైట్ల(Naxalites)ను అరెస్ట్ చేశారు. వారి దగ్గరున్న ఎయిర్‌గన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నక్సలైట్ల పేరుతో నకిలీలు..
కష్టపడి పని చేయడం, స్వశక్తిని నమ్ముకొని జీవించడం చేతకాని చాలా మంది అడ్డదార్లు తొక్కుతున్నారు. కొందరు దోపిడీలు చేస్తుంటే మరికొందరు దొంగతనాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు కేటుగాళ్లు జనాన్ని మోసం చేయడానికి నకిలీ నక్సలైట్ల అవతారమెత్తారు. జిల్లాలోని లక్షేట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మేడి వెంకటేష్, పెద్దంపేటకు చెందిన ఆరేందుల రాజేష్ అనే ఇద్దరూ ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. బిజినెస్ లేకపోవడం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఈజీగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నక్సలైట్ల పేరుతో చలామణి అయ్యారు. ఈవిషయంలో రాజేశ్ సలహా ప్రకారమే వెంకటేష్ కూడా తప్పుడు దారిలో ప్రయాణించాడని పోలీసులు తేల్చారు.
ఈజీ మనీ కోసం ..
ఇద్దరూ హైదరాబాద్ నుండి రెండు ఎయిర్ గన్స్, ఫోన్, కొత్త సిమ్ కొనుగోల్ చేసారు. ఆ తర్వాత నస్పూర్ లో కాంతయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. రాజేష్ చెప్పిన పథకం ప్రకారం గత నెల 21న వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్‌ని వెంట తెచ్చుకొని అర్ధరాత్రి టైమ్‌లో కాంతయ్య ఇంటి ఆవరణలో పడేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, అతని కొడుకు నాగరాజుకు ఫోన్ చేసి నక్సలైట్‌లమని తిర్యాణి అడవుల నుండి మాట్లాడుతున్నట్లుగా చెప్పారు. ఇంటి ముందు తుపాకులు పెట్టింది మేమే ..వెంటనే 40 లక్షలు ఇవ్వాలని లేకపోతే ప్రాణాలు తీస్తామని ఫోన్‌లో బ్లాక్ మెయిల్ చేశారు.
అనుమానంతో అరెస్ట్ ..
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు మంచిర్యాల రూరల్ పోలీసులు. సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఫోన్ కాల్ వచ్చిన సిమ్ నెట్‌వర్క్ ఆధారంగా సిసిసి నస్పూర్ లోని తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ చేసి విచారించారు.
నేరచరిత్ర కలిగిన నిందితులు..
నింధితుల నుంచి రెండు ఎయిర్ గన్స్, ఓ మొబైల్ ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రాజేష్ అనే వ్యక్తిపై గతంలో మంచిర్యాల, హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు కూడా ఉన్నట్లుగా రామగుండ పోలీసు కమీషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, Naxals, Telangana crime news