హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dandari Ghusadi: గిరిజన గూడాల్లో దండారి సన్నాహాలు... ఆకట్టుకుంటున్న నెమలి కిరీటాలు

Dandari Ghusadi: గిరిజన గూడాల్లో దండారి సన్నాహాలు... ఆకట్టుకుంటున్న నెమలి కిరీటాలు

గిరిజన గూడాల్లో దండారి సన్నాహాలు

గిరిజన గూడాల్లో దండారి సన్నాహాలు

వెల్లివిరిసిన ఆదివాసి సంస్కృతికి ఖజానా ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడి గిరిజనులు జరుపుకునే ఏ పండుగ అయినా వేడుక అయినా అందులో ఆటపాటలకు ప్రాధాన్యముంటుంది. అలా ఆదివాసి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అతి ముఖ్య పండుగల్లో ఒకటైన దండారి వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాల్లో సన్నాహాలు కొనసాగుతున్నాయి.

ఇంకా చదవండి ...

  వెల్లివిరిసిన ఆదివాసి సంస్కృతికి ఖజానా ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడి గిరిజనులు జరుపుకునే ఏ పండుగ అయినా వేడుక అయినా అందులో ఆటపాటలకు ప్రాధాన్యముంటుంది. అలా ఆదివాసి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అతి ముఖ్య పండుగల్లో ఒకటైన దండారి వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాల్లో సన్నాహాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూలన కొండకోనల్లో ఉన్న గిరిజన గూడాల్లో గుసాడి నృత్య ధ్వనులు ప్రతిధ్వనించనున్నాయి.

  ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలోని ఆదివాసి గోండు, కొలాం గిరిజనులు ఈ దండారి ఉత్సవాలను సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా గుస్సాడి వేషధారణతో నృత్యాలు చేయడం ఆనవాయితీ. అయితే గుస్సాడి వేషధారణ సమయంలో ధరించే నెమలి ఈకల టోపీల తయారి ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిట్టగూడలో ప్రత్యేకంగా నెమలి ఈకలతో గుసాడి టోపీలను తయారు చేయించి వాటిని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్ మండలాలకు తీసుకువెళుతున్నారు. మరోవైపు అదే జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలోనూ గుస్సాడి కళాకారుడు, ఇటీవల ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనక రాజు గుస్సాడి టోపీల తయారీలో తన శిష్యులకు శిక్షణనిస్తున్నారు.


  ఎంతో నిష్టతో, నేర్పు, నైపుణ్యంతో నెమలి ఈకలను వరుసగా పేర్చికళాకారులు గుసాడి టోపీలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా గుస్సాడి వేషధారణకు ఉపయోగించే దుడ్డు కర్రలు, గజ్జెలు, గుగ్గుర్లు, వస్త్రాలు, డోలు తదితర వస్తువులను సిద్దం చేసుకుంటున్నారు.

  దీపావళి పండుగకు ముందు ఈ గుస్సాడి వేడుకలు ప్రారంభమై దీపావళి పండుగ అనంతరం ముగుస్తాయి. దాదాపు 12 రోజులపాటు ఈ దండారి వేడుకలను ఎంతో నిష్టతో గోండు, కొలాం గిరిజనులు జరుపుకుంటారు. గుస్సాడిలో వివిధ రకాల వేషధారణలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.


  ఈ దండారి వేడుకల్లో భాగంగా యేత్మసూర్, పెర్సాపేన్ తదితర దేవతలకు తమ సంప్రదాయ పద్దతుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇంకా ఒక గూడానికి చెందిన దండారి బృందం మరో గూడాని అతిథులుగా వెళ్ళడం, ఆ గూడెం వారు ఈ బృందానికి ఘనంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేయడంతోపాటు ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో గూడానికి గుస్సాడి బృందాలు వెళుతుంటాయి.

  కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Adilabad, Diwali, Diwali 2021, Telangana News, Tribes

  ఉత్తమ కథలు