(Lenin, News 18, Adilabad)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు (Tribal) తాగు నీటి కోసం (water problem) నానా అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లోని బోరుబావులు, బావుల్లో నీరు అడుగంటిపోవడంతో నీటి కోసం (For water) కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం పూటల్లో గూడాల్లోని మహిళలు, పిల్లలు చెలిమెలు, కుంటల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్నారు. గ్రామ పొలిమేరలో ఉన్న వాగుల్లో చెలిమెలపైనే నీటి కోసం ఆధారపడుతున్నారు. మిషన్ భగీరథ పథకం (Mission Bhagiratha Scheme) ట్యాంకులు, పైపు లైన్ లు ఉన్నా ఆదివాసుల గొంతు తడపడం లేదు. వాగుల్లో చెలిమెలు తోడి, అందులో నీరు ఊరేంతవరకు గంటల తరబడి అక్కడే వేచి ఉండి తాగునీటిని తెచ్చుకుంటు కష్టాలు పడుతున్నారు. కలుషిత నీటితో అవస్థలు పడుతున్నారు. ఇక కొన్ని గూడేల్లో ఎప్పుడో తవ్వుకున్న నీటి బావులే దిక్కవుతున్నాయి. వాటిలో కూడు నీరు ఇంకిపోవడంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు.
వేసవి ప్రణాళిక లేకపోవడంతో..
ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఉట్నూరు, నార్నూరు, ఇంద్రవెల్లి, నేరడిగొండ, గుడిహత్నూరు, బజార్ హత్నూర్, సిరికొండ, తలమడుగు, బేల మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటారు. ఈసారి కూడా వేసవి కాలం ప్రారంభం నుండి నీటి ఎద్దడి సమస్య తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వేసవి ప్రణాళిక లేకపోవడంతో గిరిజనులకు యేటా నీటి కష్టాలు తప్పడం లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం తాగేందుకు మంచి నీటి సదుపాయం కూడా కల్పించడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డెక్కి ఆందోళనలు..
ఐటిడిఏ (ITDA) అధికారులు తమ గూడాలవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం మిషన్ భగీరథ పథకం ద్వారా గిరిజన గ్రామాలకు తాగు నీరు సరఫరా అవుతోందని అంటున్నారు. మరోవైపు ఏజెన్సీలోని గిరిజనులు తాగునీటి కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. గొంతు తడపాలని వేడుకుంటున్నారు.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గిరిజను ఉట్నూరులోని ఐటిడిఏ కార్యాలయాన్ని ముట్టడించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఖాళీ బిందెలతో తరలివచ్చి కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో ఉట్నూర్ మంచిర్యాల రహదారి పై గంటకుపైగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఉట్నూర్ సిఐ సైదారావ్ ఐటిడిఎ పిఓ తో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. అయితే ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వచ్చేంత వరకు రోడ్డుపై నుండి లేచేది లేదని దొంగచింత గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు.
చివరికి ఐటీడీఎ ఏఓ చొరవతో పీఓ వద్దకు వెళ్ళి నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పారు. గ్రామస్తులతో పీఓ మాట్లాడుతూ.. త్వరలో దొంగచింత గ్రామంలో బోరు వేయిస్తామని తెలిపారు. అప్పటి వరకు ట్రాక్టర్ సాయంతో ట్యాంకర్ ద్వారా త్రాగునీటిని అందించాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఏఈ సతీష్ ఇతర అధికారులను ఆదేశించడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Water Crisis, Water problem