నాడు అనుబంధ గ్రామం - నేడు ఆదర్శ గ్రామం.. కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక

ముఖ్రా(కె) గ్రామం

ఒకప్పుడు అది చిన్న అనుబంధ గ్రామం. నాడు ఆ గ్రామంలో అంతగా చదువు లేదు. కానీ రెండేళ్ళ క్రితం ప్రత్యేక పంచాయతీగా అవతరించింది.

 • Share this:
  ఒకప్పుడు అది చిన్న అనుబంధ గ్రామం. నాడు ఆ గ్రామంలో అంతగా చదువు లేదు. కానీ రెండేళ్ళ క్రితం ప్రత్యేక పంచాయతీగా అవతరించింది. అప్పటి నుంచి ఆ గ్రామం దశ మారిపోయింది. ఇపుడు ఆ గ్రామం అభివృద్దిలో దూసుకుపోతూ ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఆ గ్రామాన్ని సందర్శించిన వారంతా వారెవ్వా అంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్చ పురుస్కారానికి కూడా ఎంపికైంది. దేశంలో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలను ఈ పురస్కారానికి ఎంపిక చేయగా అందులో ఈ గ్రామానికి చోటు దక్కింది. అందరి చేతా ఔరా అనిపించుకుంటూ జాతీయ స్థాయిలో స్వచ్చ పురస్కారానికి ఎంపికైన ఈ గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ముఖ్రా(కె) గ్రామం. ఒకప్పుడు ఈ ఊరు ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్చ పురస్కారానికి ఎంపికకావడంతో అందరి దృష్టి ఆ ఊరిపై పడింది.

  దాదాపు 160 కుటుంబాలు ఉన్న ఈ గ్రామ జనాభా 700 మంది వరకు ఉంటారు. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామం అభివృద్ది వైపు దూసుకుపోతోంది. గ్రామస్థులంతా సంఘటితమై ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించి పలు అవార్డులను సొంతం చేసుకుంది. నాడు కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేయడంతో నగదు రహిత లావాదేవీలు జరిపి దేశంలోనే నాల్గవ గ్రామంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. లాక్ డౌన్ సమయంలోనూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరికి ఉపాధి కల్పించిన గ్రామ పంచాయతీగా రాష్ట్రంలోనే గుర్తింపును పొందింది.  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ది సంక్షేమ పథకాల అమలులో ముఖ్ర(కె) గ్రామం ముందు వరుసలో నిలవడంతో ప్రముఖ నేతలు, అధికారులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల జల్లులు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా 10 వేల మొక్కలను నాటి వంద శాతం రక్షించిన ఏకైక గ్రామంగా కూడా ప్రత్యేక గుర్తింపును సాధించింది ఈ గ్రామం. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ ఆదర్శంగా నిలిచింది ఈ పల్లె. జిల్లాలోని మారుమూల గ్రామమైన ఈ ముఖ్ర(కె) గ్రామంలో జరుగుతున్న అభివృద్దిని చూసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిపోతున్నారు. రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ప్రస్తుతం ఈ ఊరు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లుకొడుతోంది.
  Published by:Sumanth Kanukula
  First published: