ఆదిలాబాద్ జిల్లాకు భారీ వరద‌... ప్రాజెక్టులకు జలకళ

ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

news18-telugu
Updated: August 16, 2020, 5:11 PM IST
ఆదిలాబాద్ జిల్లాకు భారీ వరద‌... ప్రాజెక్టులకు జలకళ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నజిల్లాలోని పెన్ గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామలు జలదిగ్బంధనమయ్యాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం శివారులో ఈదుల ఒర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రవీంద్రనగర్ గ్రామానికి చింతలమానెపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని దింది గ్రామం జలదిగ్భంధనమైంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, పెంచికల్ పేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. కాలినడకన వెళ్ళి పెంచికల్ పేట్ మండలంలోని బొక్కివాగు మత్తడిని పరిశీలించారు. నదీ పరివాహాక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు. బెజ్జూరు మండలంలోని కుష్ణపల్లి, సీతాపూర్ వాగులు ఉప్పొంగడంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టు, వట్టివాగు, చెలిమల వాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి కూడా భారీగా నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తుస్తోంది. ఇన్ ఫ్లో పెరగడంతో నీటి పారుదల శాఖ అధికారులు కొమురంభీం, స్వర్ణ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం సరిహద్దున పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎస్ ఐ ఆరీఫ్ పరివాహక గ్రామాలైన వడూర్, అంతర్గాం, తాంసి(కె) గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్ళవద్దని, నదిలో పడవ ప్రయాణం చేయవద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి కింది స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 16, 2020, 5:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading