(K.Lenin,News18,Adilabad)
ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అందినకాడికి దండుకొని మోసాలకు పాల్పడతున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత బాధితులు లబోదిబోమంటున్నారు. ఇటువంటి సంఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. సుమారు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పాల కేంద్రాన్ని నెలకొల్పుతామని, ఆవులు గేదేలు ఇప్పిస్తామని రైతులను మోసం చేసి వారి వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుండి పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ పాసు బుక్కులు, కంపెనీ లెటర్ ప్యా డ్స్, రైతుల నుండి సేకరించిన డిపాజిట్లకు సంబంధించిన రశీదులను, కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. లోన్ డిపాజిట్ పేరు మీద 18 మంది అమాయక రైతుల నుండి 21 లక్షల రూపాయలను వసూలు చేశారు. సభ్యత్వం పేరిట వెయ్యి మంది రైతుల నుండి ఒక్కొక్కరి నుండి 708 రూపాయల చొప్పున 7 లక్షల 80 వేల రూపాయలను సేకరించారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ, బోడపాటి సెజల్ అలియాస్ నందిని రైతులకు మాయమాటలు చెప్పి డబ్బు సంపాదించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి వచ్చారు. కొందరు రైతులు, స్థానిక ప్రజలతో పరిచయం పెంచుకున్నారు.
Etela Rajender: సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..పతనం ప్రారంభం అంటూ..
త్వరలోనే బెల్లంపల్లిలో 50 కోట్ల రూపాయల పెట్టుబడితో పాల కేంద్రానికి నెలకొల్పనున్నామని, రైతులకు ఆవులు, గేదెలు ఇప్పిస్తామని, పశువులు ఉన్నవారికి ఇన్స్ రెన్స్ చేయిస్తామని నమ్మబలికారు. పశుసంవర్ధక శాఖపై పట్టున్న ఇద్దరు వ్యక్తులు చిలరప్ సంతోష్, కుమ్మరి పోశంలను భాగస్వాములను చేసుకొని ఓ రైతుకు గేదెలు ఇస్తే మిగతా రైతులు నమ్మి డబ్బులు కడతారని ఆలోచించారు. దీనితో గత సంవత్సరం ఆగస్టులో ఓ రైతుకు ఎనిమిది గేదెలు, రెండు ఆవులను మహారాష్ట్రలోని ఓ డేయిరీ నుండి తీసుకువచ్చి తాండూర్ లోని ఓ రైతుకు ఇచ్చి ఆ ఫోటోలను మిగతా రైతులకు చూపిస్తూ, అమాయక రైతుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశారు.
రైతులు 35 శాతం డబ్బులు ఇవ్వగలిగితే మిగతా 65% కంపెనీ వారు చెల్లించి మీకు ఒక యూనిట్ పెడతామని నమ్మబలికారు. ఆ యూనిట్ లో పశువుల ద్వారా వచ్చే పాలు కూడా తామే తీసుకొంటామని, ముందుగా 65 శాతం భరిస్తున్నందుకు నాలుగు ప్రామిసరి నోట్స్, మూడు ఖాళీ చెక్కులు రైతుల దగ్గరి నుండి తీసుకొని రైతుల ధగ్గర నుండి తప్పుడు ఒప్పందం చేసుకున్నారు. వారి వద్ద నుండి ఆ 35% కి సంబంధించి డబ్బులు వసూలు చేసి 45 రోజులలో పశువులు ఇచ్చే బాధ్యత తమదని చెప్పి నమ్మించారు. ఇలా దాదాపు వెయ్యి మంది అమాయక రైతుల నుండి కంపెనీ సభ్యత్వం కోసం ఒక్కొక్కరి వద్ద నుండి 708 రూపాయలను తీసుకున్నారు. ఇలాగే ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ , సూర్యాపేటలో కూడా రైతులను మోసం చేయాలని సమావేశాలు ఏర్పాటు చేశారు.
చివరకు ఇదంతా మోసం అని గ్రహించిన రైతులు సంబంధిత పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం బెల్లంపల్లి బస్టాండ్ కన్నాల బస్తీ ప్రాంతం ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్, బెల్లంపల్లి టూ టౌన్, బెల్లంపల్లి వన్ టౌన్, కాసిపేట్, తాండూరు, జన్నారం, జైపూర్ పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Medak, Telangana