హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కుంగిపోయిన వంతెనతో పొంచివున్న ముప్పు..అంతరాష్ట్ర రాకపోకలకు బ్రేక్

Telangana: కుంగిపోయిన వంతెనతో పొంచివున్న ముప్పు..అంతరాష్ట్ర రాకపోకలకు బ్రేక్

bridge collapsed

bridge collapsed

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం వాగు పై నిర్మించిన వంతెన పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై నుండి రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవు తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India

(K.Lenin,News18,Adilabad)

ఆదిలాబాద్ (Adilabad)జిల్లా జైనథ్ మండలం తర్నం వాగుపై నిర్మించిన వంతెన కుంగిపోయి ప్రమాదకర స్థితి నెలకొంది. నిత్యం ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించే గ్రామస్థులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వంతెన అంతరాష్ట్ర రహదారిపై ఉండటంతో నిత్యం మహారాష్ట్ర (Maharashtra)నుండి రాకపోకలు సాగించేవారితోపాటు జిల్లాలోని జైనథ్(Zainath), బేల(Bela)మండలాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా అప్పటి కాంగ్రెస్(Congress)ప్రభుత్వ హాయంలో 35 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన ఇది. ఈ వంతెన రోడ్డు భవనాల శాఖ పరిధిలోనిది. 2018 సంవత్సరం ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షానికి సాత్నాల ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో వంతెనపై వాగు ఉధృతి పెరిగి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. వంతెనపై పగుళ్ళు కూడా ఏర్పడి రాకపోకలు స్థంభించిపోయాయి. అయితే ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తులను చేపట్టి తర్వాత రాకపోకలను పునరుద్దరించారు. కానీ ఈ వంతెన మీదుగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు.

కుంగిపోయిన వంతెన..

ఇది జాతీయ రహదారిగా మారడంతో నిత్యం భారీ వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి ఆదిలాబాద్ కు, ఆదిలాబాద్ నుండి చంద్రపూర్ నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలూ సాగిస్తుంటాయి. ఇదిలా ఉంటే వంతెన కింది భాగంలోని వాగులోకి వెళ్ళిన గ్రామస్థులు వంతెన కుంగిపోయి, పగుళ్ళు తేలి ఉండటం గమనించారు. ప్రమాదం పొంచి ఉందని భావించిన గ్రామస్థులు ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అప్రమత్తమైన రెవెన్యూ సిబ్బంది, పోలీసులు వంతెన వద్దకు చేరి పరిశీలించారు. ఉన్నత అధికారులకు సమాచారమిచ్చారు. వంతెన కుంగిపోవడంతో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. దీంతో జైనథ్, బేల మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఇదే దారిపై రాకపోకలు సాగిస్తారు.

ప్రయాణికులకు తప్పని తిప్పలు...

కాగా తర్నం వంతెన కుంగిపోయి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మొదట దారిని మళ్లించారు. అయితే కుంగిపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తారా లేక దానికే మరోసారి మరమ్మత్తు చేపడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వంతెన మీదుగా జాతీయ రహదారి విస్తరణ కోసం నిధులు కూడా మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం ఉన్న వంతెన స్థానంలో 25 కోట్ల రూపాయల ఖర్చుతో  హైలెవల్ వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు కూడా పంపించారు. అయితే వంతెన పనులు ఎప్పుడు పూర్తవుతాయే, తమ ఇబ్బందులు ఎప్పుడు తొలిగిపోతాయోనని ఎదురుచూస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగుపై వంతెన కుప్పకూలి పెను ప్రమాదం తప్పింది. అలాంటి పరిస్థితి ఎదురుకాకముందే అధికారులు సత్వరమే కుంగిపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టి శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Adilabad, Telangana News

ఉత్తమ కథలు