Nirmal Politics: సాధారణ ఎన్నికలకు ఇంకా గడువు సమీపించనే లేదు ఇప్పటి నుంచే నేతలు దూకుడు పెంచారు. అధికార పక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఆయా పార్టీల నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో కాంగ్రేస్, బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. చిలికి చిలికి గాలి వాన తుఫానులా మారినట్టు..వీరు మాటల యుద్ధం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసే దాకా చివరకు నోటీసుల వరకు వెళ్ళింది. కాంగ్రేస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పని అయిపోయిందని, రేపో మాపో పార్టీ మారడం ఖాయమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి రాజేశాయి.
పార్లమెంటులో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే స్పందించని మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తే ధర్నాలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏ. మహేశ్వర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆరు నెలల్లో ఐదు పార్టీలు మారిన చరిత్ర అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిదని సెటైర్లు వేశారు. తాను రెండు సార్లు ఓటమిపాలైనా, కష్టాలు ఎదురైనా కాంగ్రేస్ పార్టీలో ఉన్నాను తప్ప పార్టీలు మారలేదని స్పష్టం చేశారు. అవకాశవాద రాజకీయాలు చేసే చరిత్ర మంత్రిదని ఎద్దేవా చేశారు.
పార్టీ మారాలనుకుంటే తనకు అడ్డు ఎవరు లేరని, అయినా కష్టమైన నష్టమైన కాంగ్రేస్ పార్టీలోనే తొమ్మిది సంవత్సరాల నుండి ఉన్నానని వెల్లడించారు. అటు నిర్మల్ మున్సిపాలిటిలో ఉద్యోగాల నియామకాలపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. నిర్మల్ మున్సిపల్ ఉద్యోగాల నియామకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వరె రెడ్డి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. అసత్య ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారని, ఆరోపణలకు ఆధారాలు చూపాలని అన్నారు.
తాను తప్పు చేస్తే చట్ట ప్రకారం ఏ శిక్షకైనా సిద్దమని స్పష్టం చేశారు. మరోవైపు నిర్మల్ మున్సిపల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మంత్రి చేసిన ఆరోపణలను తప్పుపడుతూ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష్డు రాము పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసును అంటించి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి కేటిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రేస్, బిజెపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు పంపిన నోటీసులను కూడా ఇలాగే ఇంటి వద్ద అతికించి వచ్చిన తరహాలోనే మహేశ్వర్ రెడ్డి నివాసంలోన్ అదే పునరావృతం కావడంతో రాష్ట్రంలో నోటీసుల పర్వానికి తెరలేచినట్లుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికి ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, BRS, Congress, Minister indrakaran reddy, Telangana