(K.Lenin,News18,Adilabad)
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ ఎస్ భారత రాష్ట్ర సమితి (BRS)పేరుతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. దీంతో పార్టీ విస్తరణపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రను ఎంచుకొని తొలి బహిరంగ సభను మహారాష్ట్ర(Maharashtra)లోని నాందేడ్ (Nanded)లో నిర్వహించారు. అంతటితో ఆగిపోగుకుండా మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు పక్కా ప్రణాళికలతో ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఒక అవకాశంగా మలుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు..
ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని తన బలాన్ని నిరూపించుకుంది. క్రమంగా అసెంబ్లిలోనూ పాగా వేసింది. అదే ఫార్మూలను ఇపుడు మహారాష్ట్రలోను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ సరిహద్దున ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని యవత్మాల్, వార్ధా, వాసిం, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలపై కన్నేసిన గులాబి దళపతి ఆయా జిల్లాల్లో పార్టీ ప్రచారానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలను ఇంచార్జీలుగా కూడా నియమించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్ శాసన సభ్యుడు జోగు రామన్న, ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు గొడెం నగేష్ లకు ఈ బాధ్యతలను అప్పగించారు. త్వరలోనే మరికొన్ని జిల్లాలకు కూడా ఇంచార్జీలను నియమించనున్నట్లు సమాచారం.
పార్టీ విస్తారణకు ప్రయత్నం..
అయితే తొలుత ఒక్కొక్క నేతకు ఒక్కో జిల్లా బాధ్యతను అప్పగించాలని భావించినప్పటికి ప్రస్తుతానికి రెండు మూడు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరికొందరు సీనియర్ నాయకుల సేవలను కూడా మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. తొలుత మహారాష్ట్ర పాగా వేసి తదనంతరం ఒక్కో రాష్ట్రానికి పార్టీని విస్తరించుకుంటూపోయి రానున్న ఎన్నికల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.
మహా ఎన్నికలపై గురి..
ఇటీవల హైదరాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలతోపాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పలుమార్లు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బిఆర్ ఎస్ పార్టీ ఏరకంగా ఎన్నికల్లో ముందుకుపోతుందో, ఏ మేరకు లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, BRS, CM KCR, Telangana Politics