(K.Lenin,News18,Adilabad)
అడవుల జిల్లా… ఆదివాసుల ఖిల్లాగా… పిలువబడటమే కాకుండా, సుందర జలపాతాలు, ప్రాచీన కట్టడాలకు నిలయమై, ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలకు ఆలవాలమై ఉన్న ఆదిలాబాద్Adilabad జిల్లా మరో గుర్తింపును సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా ఆదిలాబాద్ జిల్లా గుర్తింపును సొంతం చేసుకుంది. తెలంగాణ(Telangana)లో మొదటి స్థానాన్ని, దేశంలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన రిపోర్టు(Report)లో ఆదిలాబాద్ జిల్లా సురక్షితమైన జిల్లా(Safe district)గా గుర్తింపుపొందింది.
అడవుల జిల్లాకు అరుదైన రికార్డ్..
సామాజిక ప్రగతి సూచికలో 85 మార్కులతో దేశంలో ఐదవ స్థానాన్ని, రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సామాజిక ప్రగతి సూచిక, సురక్షితమైన జిల్లాల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 85 మార్కులతో ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదవ స్థానాన్ని తెలంగాణలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సర్వేలో 89 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు. అందులో ముఖ్యమైనవి మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, హత్యలు, రోడ్డు మరణాలు, హింసాత్మక నేరాలు తదితర అంశాలను వ్యక్తిగత భద్రత పరిమితిని లెక్కించేందుకు పరిగణలోకి తీసుకున్నారు.
దేశంలోనే సురక్షితమైన జిల్లాగా గుర్తింపు..
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా విడుదల చేసిన ఈ నివేదికలో ఆదిలాబాద్ జిల్లా మారుమూల జిల్లా అయినప్పటికీ మార్కులు సంపాదించే పారామీటర్లలో ఆదిలాబాద్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపాయి. తెలంగాణ వ్యక్తిగత భద్రత స్కోరు 42 గా ఉండగా ఆదిలాబాద్ జిల్లా వ్యక్తిగత భద్రతా స్కోరు 85 గా ఉండి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా ఈ భద్రత ర్యాంకింగ్స్ రావడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డికి ప్రముఖుల ద్వారా అభినందనలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో ఫస్ట్..దేశంలో ఐదో స్థానం..
ఈ ర్యాంకింగ్ లో నాగాలాండ్ లోని మొకొక్ జిల్లా 89.89 మార్కులతో అగ్రస్థానంగా ఉండగా, తెలంగాణలో కరీంనగర్ జిల్లా 81 మార్కులతో రెండవ స్థానం లో ఉంది. సామాజిక ప్రగతి సూచికలో మూడు కోణాలలో ప్రజల కనీస అవసరాలు, మంచి మనిషిగా తీర్చిదిద్దేందుకు కావలసిన పునాదులు, కొత్త అవకాశాలు ప్రతి ఒక్క కోణాన్ని నాలుగు విభాగాలుగా విభజించి సూచికను తయారు చేస్తారు. ఇదిలా ఉంటే జిల్లాకు రాష్ట్రంలో మొదటి, దేశంలో ఐదో స్థానం దక్కడం సంతోషంగా ఉందని ఆదిలాబాద్ జిల్లా ఎస్.పి. ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమైందని ఆయన పేర్కోన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Telangana News