(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్18)
ఈ రోజుల్లో చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగం చేసే అనేక మంది కోట్లకు కోట్లు కూడబెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇటీవల అనేక మంది అధికారులు కోట్ల రూపాయలను లంచంగా తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే అందరూ అలానే ఉంటారనుకోవడం పొరపాటే. నిజాయితీ అన్న పదానికి నిలువెత్తు నిదర్శంగా ఉండే అధికారులు సైతం ఉంటారు. జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ వై.వీ.గణేష్ అదే కోవకు చెందిన అధికారి. ఆయన అందరిలాంటి ఆఫీసర్ కాదు. నీతి, నిజాయితీ, నిబద్ధతలకు ప్రతిరూపం. అందుకే ఆయనకు కష్టమొచ్చిందని తెలియడంతోనే ఎక్కడెక్కడో ఉన్న మిత్రులంతా కదిలొచ్చారు. భూపాలపల్లిలో ఓ అర్థరాత్రి గణేష్‌కు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. ఆయనను అక్కడి నుంచి హుటాహుటిన హన్మకొండకు తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టిందని.. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అపస్మారక స్థితిలో ఉన్నగణేష్ ను అక్కడి నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే కేవలం గణేష్ జీతంతోనే బతికే ఆయన కుటుంబం వద్ద చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి.
దీంతో గణేష్ మిత్రులంతా తలా ఓ చేయి వేశారు. ఈ అత్యవసర సమయంలో అండగా నిలబడ్డారు. ఇలా ఇప్పటికి ఏకంగా రూ. పది లక్షలకు దాకా పోగు చేయగలిగారు. ఇంకా పెద్దమొత్తంలో జమచేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆయనతో చదువుకున్న మిత్రులు.. రూంమేట్స్.. బ్యాచ్‌మేట్స్ .. సబార్డినేట్స్.. ఇలా ఇప్పటికే అందరూ తోచిన రీతిలో సాయం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో 1990-92 పీజీ బ్యాచ్.. 1988-90 డిగ్రీ బ్యాచ్.. 1995 ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ల బ్యాచ్.. భూపాలపల్లి జిల్లా రెవెన్యూ అధికార్ల బ్యాచ్.. ఇంకా ఖమ్మంలో పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే ఎకో ఫ్రెండ్లీ బ్యాచ్.. ఇలా ఎవరి ప్రయత్నం వారు చేశారు. మొత్తానికి కష్టంలో ఉన్న స్నేహితుడిని కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ పూర్తయింది. ఆయన ఐసీయూలో కోలుకుంటున్నారు. అయితే ఇంకా సుమారు రూ. 15 లక్షల దాకా ఆసుపత్రి బిల్లు చెల్లించాల్సి ఉండడంతో గణేష్ కుటుంబం చేతులో డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తోంది.
సామాన్య కుటుంబం నుంచి డిప్యూటీ కలెక్టర్ దాకా..
సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన గణేష్ ది ఖమ్మం పట్టణంలోని మామిళ్లగూడెం. ఇప్పటికీ ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఖమ్మంలోనే ఉంటున్నారు. ఇటీవలే ఆయన తల్లి మరణించడం.. మరో వైపు ఉద్యోగపరంగా నిత్యం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడంతోనే ఆయనకు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిందని చెబుతున్నారు. పాతికేళ్లుగా రెవెన్యూశాఖలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా కేవలం జీతంతో బతుకుతున్న అధికారి ఆయన. తాను నమ్ముకున్న విలువల కోసం ఆరాటపడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ఇన్నాళ్లు ఆయన సేవలందిస్తూ వచ్చారు. డిప్యూటీ తహసీల్దారుగా, తహసీల్దారుగా.. డిప్యూటీ కలెక్టరుగా.. ఆపైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరుగా వై.వీ.గణేష్‌కు ఎక్కడికెళ్లినా మంచిపేరుంది.
గణేష్ పనిచేసిన మండలాలు, డివిజన్లలోని ప్రజలు ఇప్పటికీ ఆయన చేసిన సేవలను, ఆయన నిజాయితీని తలుచుకుంటుంటారు. దీంతో పాటు గణేష్ తనకు తీరిక సమయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తన మిత్రులతో కలసి 'ఎకో ఫ్రెండ్లీ' యాక్టివిటీస్ చేస్తుంటారు. విరివిగా మొక్కలు నాటడం.. పర్యావరణంపై విద్యార్థులు.. యువతలో చైతన్యం కోసం డిబేట్లు లాంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దీనికితోడు కోవిడ్ లాక్డౌన్ సమయంలో తాను, తనకు తెలిసిన ఇతరుల నుంచి అవసరంలో ఉన్న వలస కార్మికులు, పేదవారికి ఆహారం, నిత్యావసరాలు సాయం చేశారు.
ఉద్యోగరీత్యా తామంతా ఎక్కడున్నా నిత్యం టచ్‌లోనే ఉంటామని.. అలాంటి వ్యక్తికి ఇలాంటి కష్టం రావడంతో మేమంతా తల్లిడిల్లిపోయామని గణేష్ స్నేహితుడు రామచంద్రరావు చెప్పారు. ఇప్పటికే తాను, కీసర ఆర్డీవో రవి, వైద్యశాఖలో పనిచేసే జగన్మోహనాచారి సహా హైదరాబాదు, వరంగల్ లో పనిచేసే పోలీసు అధికారులు కొంత సాయం చేశారన్నారు. ఆయన 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యవస్థలో నిజాయతీ కలిగిన ఆఫీసర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందిస్తే గణేష్ కుటుంబానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా తాము, పాత స్నేహితులు కలసి ఇప్పటికి తాము కొంత సొమ్మును పోగుచేసి చెల్లించామని, ఇంకా మిగిలిన డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health