news18-telugu
Updated: October 29, 2020, 8:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్పల్లిలోని భూగర్భ బొగ్గుగనిలో జంక్షన్ కూలిపోయింది. 66 లెవల్లోని 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. నవీన్ అనే కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందాడు. మరో ముగ్గురు కార్మికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారికి గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం లేదని తెలిసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింగరేణిలో ప్రమాదం జరిగింది. సింగరేణిలో బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బి గనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు పెడుతుంటారు. ఈ క్రమంలోనే కేబుల్‌వైర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ ఫైర్ అయింది. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సింగరేణి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రత్నం, లింగయ్య, రాజం, సుమన్, శ్రీకాంత్‌గా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో రత్నం అనేక కార్మికుడు చనిపోయాడు.
జూన్‌లో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు దుర్మరణం
జూన్‌లో రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్టులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉపరితల గని1లోని ఫేజ్ 2లో ఈ ప్రమాదం జరిగింది. మహాలక్ష్మి ఓబీ బ్లాస్ట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఐదుగురు ఒప్పంద కార్మికులని అధికారులు వెల్లడించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ ఈ ప్రమాదం చోటుచేసుకోవడం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.
ప్రతి రెండు మూడు నెలలకు ఓ సారి ఇలా సింగరేణిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సింగరేణి యాజమాన్యం తరఫు నుంచి అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం పలు కుటుంబాల్లో విషాదాలు నింపుతోంది. కార్మికులు చనిపోవడంతో కూలీల మనోధైర్యం దెబ్బతింటోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 29, 2020, 6:27 PM IST