(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా స్పందిస్తూ జీతాలు పెంచుతున్నా కొంతమంది లంచాలకు అలవాటు పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. లంచాల ద్వారా అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు అధికారులు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటివారిపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా.. వారికి ఏమీ పట్టనట్లు లంచాల మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా ఓ నర్సరీ వ్యాపారి దగ్గర మూడు లక్షల రూపాయలను అటవీ శాఖ అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లా అటవీ శాఖ డీఎఫ్ఓ బాబ్జి రావు మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గోరంట్ల కు చెందిన నాగ రాజు అనే నర్సరీ మొక్కల వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగరాజు చాలా సంవత్సరాలుగా నర్సరీ మొక్కలను సప్లై చేసే వ్యాపారం చేస్తున్నాడు. అతడు నాలుగేళ్లుగా వనపర్తి జిల్లా కు మొక్కలను సప్లై చేసే వాడు. ఈ సంవత్సరం రెండు లక్షలా నలభై వేల మొక్కలను సప్లై చేయగా.. లక్షా తొంభై వేల మొక్కలే ఉన్నాయంటూ.. డి ఎఫ్ ఓ బాబ్జీరావు నాగరాజును వేధించసాగాడు.
తనకు రావలసిన బిల్లులు మొత్తం రావాలంటే.. ఏడు లక్షల రూపాయల లంచం ముందుగా అడిగాడు. అంతగా ఇచ్చుకోలేను అని చెబితే.. నాలుగు లక్షలా ఇరవై వేల రూపాయలు ఫైనల్ గా అడిగాడు. అయితే మూడు లక్షల రూపాయలు ఇస్తానని నాగరాజు బాబ్జి రావు తో ఒప్పందం కుదుర్చుకుని.. మొత్తం వ్యవహారాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకు వచ్చాడు. దాంతో తన కార్యాలయంలోనే నాగరాజు తో మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.