TV9లో రవి ప్రకాశ్ ప్రస్థానం ముగిసింది. కాసేపటి క్రితం సమావేశమైన ABCL డైరెక్టర్స్ బోర్డు..టీవీ9 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ABCL డైరెక్టర్స్ బోర్డు ఆయనకు అదనంగా టీవీ9 తెలుగు బాధ్యతలను అప్పజెప్పింది. అటు గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన్ను టీవీ9 సీవోవోగా నియమిస్తూ ABCL డైరెక్టర్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది. టీవీ9 ఉద్యోగులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు ఏబీసీఎల్ డైరెక్టర్లు.
రెండు రోజులుగా టీవీ9లో నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియాకు, రవి ప్రకాశ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కంపెనీలో 90శాతం వాటా ఉన్న తమను, కేవలం 8శాతం వాటా ఉన్న రవి ప్రకాశ్ పట్టించుకోవడం లేదని.. తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సంస్థ నిధులను మళ్లించారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి, సినీనటుడు శివాజీపై క్రైమ్ పోలీసులు కేసునమోదు చేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. అంతేకాదు టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు.
పోలీసుల సోదాలు జరుగుతున్న క్రమంలోనే టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. రవి ప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అంతలోనే టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన రవిప్రకాశ్..తానే టీవీ9 సీఈవోనని స్పష్టంచేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ అరెస్ట్ చేయడం లేదని వెల్లడించారు. NCLT కేసు కోర్టులో ఉందని..మే 16 విచారణ జరగుతుందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు కొందరు కుట్రలు చేశారని..అవన్నీ నిలబడబోవని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సమావేశమైన ABCL డైరెక్టర్స్ బోర్డు రవిప్రకాశ్‌ని అధికారికంగా సీఈవో పదవి నుంచి తప్పించింది.
మరోవైపు ఫోర్జరీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులను రవి ప్రకాశ్ పట్టించుకోలేదు. ఇవాళ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉన్నటప్పటికీ ఆయన వెళ్లలేదు. పోలీసుల ఆదేశాలతో టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి శుక్రవారం మధ్యాహ్నం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ ఇప్పటి వరకూ విచారణకు హాజరుకాలేదు. వీరిద్దరూ మరోసారి నోటీసులు జారీ చేయాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
టీవీ9 రవిప్రకాష్ vs అలంద మీడియా.. ఉద్యోగుల్లో ఆందోళన
నేనే సీఈవో...టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన రవిప్రకాశ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Ravi prakash, Telangana, TV9