కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే.. వచ్చిన వారు తమ కుటుంబసభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా తనకు సోకిన కరోనా బంధువులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో.. ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో తనకు సోకిన కరోనావైరస్ తన ఇంట్లోవాళ్లకు కూడా సోకుతుందేమోనని భావించిన ఓ వ్యక్తి తన కోసం విచిత్రమైన షెల్టర్ ఏర్పాటుచేసుకున్నాడు. ఏకంగా చెట్టు కొమ్మల మధ్య మంచాన్ని తాళ్లతో కట్టి అక్కడే ఉంటున్నాడు. ఈ విచిత్ర ఘటన నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో జరిగింది. గ్రామంలో కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా సోకింది. దాంతో ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తుందన్న భయమో లేక చిన్న ఇంట్లో విడిగా ఉండే అవకాశం లేదనే భావనో కానీ.. ఏకంగా ఇంటి ముందు చెట్టు మీద తన కోసం విడిగా నివాసం ఏర్పరుచుకున్నాడు.
అక్కడే ఉంటూ హోంఐసోలేషన్లా ఫీలవుతున్నాడు. శివ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉంటుండగా.. శివ మాత్రం ఇంటి ముందు ఉన్న చెట్టుపైన మంచం కట్టి అక్కడే గత తొమ్మిది రోజుల నుంచి నివాసం ఉంటున్నాడు.
ఇంట్లోవాళ్లు శివ కోసం నీళ్లు, భోజనం కింది నుంచి పంపిస్తే.. భోజనం చేసి అక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో.. ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో ఇలా ఏర్పాటు చేసుకున్నట్లు శివ చెబుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona positive, Isolation on tree, Nalgonda, Vriety isolation