భరతమాతకు ఆలయం.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

కామారెడ్డి జిల్లాలో భరతమాత ఆలయం

భరతమాత ఆలయంలో ప్రతి ఏటా మార్గశిర శుక్ల షష్ఠి రోజున భరతమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

 • Share this:
  (పి.మ‌హేంద‌ర్, న్యూస్18 ప్ర‌తినిధి)

  ఎక్కడైనా దేవుళ్ల కోసం గుడి కడతారు. విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం ఎక్కడా లేని విధంగా భరతమాతకు ఆలయం నిర్మించారు. దేవతగా కొలుస్తూ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని భరతమాత ఆలయంపై ఓ కథనం. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నది ఏ దుర్గామాత ఆలయమో లేదా మహాలక్ష్మి గుడి అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే ఇది ఎక్కడా కనిపించని భరతమాత ఆలయం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండ‌ల కేంద్రంలో 1950లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పిస్క లక్ష్మయ్య అనే స్వాతంత్య్ర సమరయోధుడు మొదట ఓ గుడిసెలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత నక్క (మంగ‌లి) రామన్న, బుర్రి గంగారాం సహకారంతో మందిర నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణపు పనులు నడుస్తుండగానే దేశభక్తితో తాము సైతం అంటూ స్థానిక పద్మశాలి సంఘం ముందుకొచ్చింది. పెండింగ్ పనులను పూర్తి చేసి, ఆ తర్వాత 1982 ప్రాంతంలో ఇక్కడ నవగ్రహాలను పలు దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ప్రతిరోజూ దీప ధూప నైవేద్యాలు సమర్పించేందుకు పూజారిని కూడా నియమించారు.

  ప్రతి ఏటా మార్గశిర శుక్ల షష్ఠి రోజున భరతమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అర్చనలు చేపడతారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భరతమాత గుడిలో మొక్కులు తీర్చుకుంటారు. భారతదేశ విశిష్టత గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఈ ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిధులు కేటాయించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: