A TEACHER IN ADILABAD IS MAKING A DANGEROUS JOURNEY IN A BOAT TO TEACH STUDENTS IN A GOVERNMENT SCHOOL ADB PRV
Great Teacher: పాఠాలు చెప్పేందుకు పంతులమ్మ సాహసం.. ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణం
ఉపాధ్యాయురాలు
వృత్తి పట్ల తనకు ఉన్నఇష్టంతో ఓ మహిళ ఉపాధ్యాయురాలు (Teacher) ప్రమాదకరమని తెసినా ప్రతిరోజు నాటు పడవలో వాగుదాటి వెళ్ళి బడిపిల్లలకు పాఠాలు చెప్పి వస్తోంది .
అన్ని సౌకర్యాలు ఉన్నా బడికి పోవడానికి కొంతమంది బద్దకిస్తున్న రోజులివి. ఇంకా ఏదో కావాలన్న డిమాండ్లు వినిపిస్తూనే ఉంటాయి. పేద విద్యార్థులకు తమ జ్ఞానాన్ని పంచి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కష్ట నష్టాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తుంటారు కొంతమంది. అయితే వృత్తి పట్ల తనకు ఉన్నఇష్టంతో ఓ మహిళ ఉపాధ్యాయురాలు (Teacher) ప్రమాదకరమని (Dangerous) తెసినా ప్రతిరోజు నాటు పడవ (Boat)లో వాగుదాటి వెళ్ళి బడిపిల్లలకు పాఠాలు చెప్పి వస్తోంది . బడి పిల్లలకు పాఠాలు చెప్పివచ్చేందుకు ఈ పంతులమ్మ చేస్తున్న సాహసం ఏమిటో తెలియాంటే ఒకసారి కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాకు పోయిరావాల్సిందే.
50 కిలో మీటర్ల దూరం..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో (Government school) పనిచేస్తున్నరజిత ఆసిఫాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఈమెను 2018 లో ఇందాపూర్ పాఠశాలలో నియమించారు. ఆసిఫాబాద్ నుండి కెరమెరి మీదుగా ఇందాపూర్ (Indhapur) గ్రామానికి చేరుకోవాలంటే 50 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అదే కెరమెరి మండలంలోని సావర్ ఖేడ్ గ్రామం మీదుగా వెళితే 25 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ మార్గంలో వెళ్ళాలంటే కొంత సాహసం చేయాల్సిందే. అదేమిటంటారా.. ఇక్కడి నుండి ఇందాపూర్ గ్రామానికి వెళ్ళాలంటే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. అందుకు నాటు పడవ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పడవ ప్రయాణం ప్రమాదమని ఆ ఉపాధ్యాయురాలికి తెలుసు. కానీ దూర భారంతోపాటు సమయం మిగులుతుందని గత మూడేళ్ళుగా నిత్యం అదే మార్గంలో బడికి వెళ్ళివస్తున్నారు.
కొద్ది దూరం ద్విచక్రవాహనంపై..
ఆసిఫాబాద్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరం వరకు ఆర్టీసి బస్సులో ప్రయాణం చేసి, అక్కడి నుండి కొద్ది దూరం ద్విచక్ర వాహనంపై… మళ్ళీ కొంత దూరం కొండలు గుట్టలు దాటుకుంటూ కాలినడకన పెద్దవాగు వరకు చేరుకుంటుంది. అనంతరం నాటు పడవలో ప్రయాణం చేసి ఇందాపూర్ గ్రామానికి చేరుకొని పాఠశాలకు వెళుతుంది. కొద్ది దూరం ద్విచక్రవాహనంపై మళ్ళీ అక్కడి నుండి నాటు పడవలో అవతలి ఒడ్డుకు తీసుకుపోతూ, తిరిగి తీసుకువస్తోంది. ఇలా తీసుకొచ్చిన ఆ వ్యక్తికి ఆ ఉపాధ్యాయురాలు నెలకు మూడు వేల రూపాయలను చెల్లిస్తోంది. అయితే మొదట ఈ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 120 కి చేరింది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు.
అయితే ఉపాధ్యాయురాలి అంకిత భావాన్ని చూసిన గ్రామస్థులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు కాకుండా తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ పోయిరావడం ఎందుకు, వేరే చోటికి బదిలీ చేసుకొమ్మని బంధు మిత్రులు సూచిస్తున్నా, ఆమె మాత్రం పట్టుదలతో ప్రతిరోజూ ఇలా పాఠశాలకు వెళ్ళివస్తున్నారు. మొదట కొంత భయమనిపించినా పిల్లల గురించి ఆలోచిస్తే ఏం భయం, ఇబ్బంది అనిపించడం లేదని, వృత్తి మీద ఇష్టంతో ఇదేం కష్టమనిపించడం లేదని ఉపాధ్యాయురాలు రజిత చెబుతున్నారు. పిల్లల కోసం పరితపించి పాఠాలు చెప్పేందుకు ప్రతిరోజు సాహసం చేస్తున్నఈ మహిళా ఉపాధ్యాయురాలి స్పూర్తితో పని చేస్తే మారుమూల పల్లెల్లోనూ మంచి ఫలితాలుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.