హోమ్ /వార్తలు /తెలంగాణ /

Organic Farming: సాగుభూమిలో కాలుపెట్టిన పీజీ విద్యార్థి.. ఆర్గానిక్​ వ్యవసాయంతో లక్షలు ఆర్జిస్తున్న యువరైతు!

Organic Farming: సాగుభూమిలో కాలుపెట్టిన పీజీ విద్యార్థి.. ఆర్గానిక్​ వ్యవసాయంతో లక్షలు ఆర్జిస్తున్న యువరైతు!

రైతు ఉప్పల శ్రీనివాసరెడ్డి

రైతు ఉప్పల శ్రీనివాసరెడ్డి

ఆయన గ్రామీణాభివృద్ధి కోర్సులో పీజీ చేశాడు. ఆ తర్వాత కొన్నిచోట్ల ఉద్యోగాలు చేసినా వాటిని వదిలేసి వ్యవసాయం బాటపట్టాడు. చదువులతో తాను సంపాదించిన జ్ఞానంతో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చాడు. ఇప్పుడు ఎందరోయువకులకు ఆదర్శంగా నిలిచాడు నల్గొండ యువరైతు.!

ఇంకా చదవండి ...

(Nagaraju,News18, Nalgonda)

Nalgonda: దేశానికి రైతే వెన్నెముక.. రైతు ఎప్పుడూ మట్టితో మమేకం అవుతూనే ఉంటాడు. మట్టి గురించి రైతుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఒకప్పుడు వ్యసాయానికి చదువు అవసరం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థుతుల్లో చదువుకున్న యువత వ్యవసాయానికి చాలా అవసరం. దేశ పురోగతికి మొదటి మెట్టు కూడా వ్యవసాయమే. రాను రానూ ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మొదలుకొని ఎంతో మంది యువత ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధిలో పీజీ చేసిన శ్రీనివాసరెడ్డి వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ వ్యవసాయం (Organic Farming) చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల కు చెందిన ఉప్పుల శ్రీనివాసరెడ్డి గ్రామీణాభివృద్ధి కోర్సులో పీజీ చదివాడు. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ఆర్గానిక్‌ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన మీటింగ్‌లకు వెళ్లి..సేంద్రియ వ్యవసాయాన్ని  (Organic Farming) ప్రారంభించాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అర్జిస్తున్నాడు.

నూతన సాగువిధానాలకు నాంది

కూలీల కొరత, అధిక పెట్టుబడుల సమస్య అధిగమించేందుకు నూతన సాగు విధానాలతో ముందుకు సాగుతూ రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 30 ఎకరాల సాగుభూమిలో మామిడి, సపోటా, బత్తాయి పంట సాగుచేస్తున్నాడు. మరో ఆరు ఎకరాల్లో.. మినుములు, పెసర, కంది లాంటి పంటలు వేస్తున్నాడు. వీటితో పాటు మరో 10 ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నాడు. వరికి పెట్టుబడి ఎక్కువ కావడంతోనూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. వరి నాటే పద్దతి కాకుండా..వెదజల్లే పద్ధతిని పాటిస్తున్నాడు. దీని వల్ల కూలీల కొరతను అధిగమించవచ్చని, పెట్టుబడి ఖర్చుని తగ్గించుకోవచ్చని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆర్గానిక్‌ పద్ధతిలో వ్యవసాయం.. ఆవుల పెంపకం

ఈ నేపథ్యంలోనే వరి సాగుతో పాటు వివిధ రకాల తోటల పెంపకానికి సేంద్రియ ఎరువులనే వాడుతున్నాడు శ్రీనివాసరెడ్డి. సాగుకు అవసరమైన ఎరువు కోసం సేంద్రీయ ఎరువుకు ప్రత్యేకంగా ఆవులను పెంచుతున్నాడు. ఎనిమిది ఆవులను పెంచుతూ వాటికి క్రమం తప్పకుండా బలవర్థకమైన పశుగ్రాసం వేస్తూ పెంచుతున్నాడు. ఆవులకు వేసే పశుగ్రాసం కూడా తన పొలంలోదే. ఆవుల నుంచి మూత్రం, పేడను వాడుతూ సేంద్రియ ఎరువులు తయారుచేసి పంటపొలాల్లో చల్లుతున్నాడు.

పెట్టుబడి ఎంతలాభం ఎంత?

శ్రీనివాస్ రెడ్డి ఒక ఎకరంలో రూ. 50 వేల పెట్టుబడితో బత్తాయి సాగు చేయగా 24 టన్నుల దిగుబడి వచ్చింది. దీంతో పెట్టుబడి పోను రూ. 3 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆరు ఎకరాల్లో ఎనిమిది వేల పెట్టుబడితో కంది పంట వేస్తే రూ.లక్ష ఆదాయం వచ్చింది. తొమ్మిది ఎకరాల్లో మూడు వేల పెట్టుబడితో ఉలువ సాగు చేయగా రూ. 72 వేల ఆదాయం లభించింది. పశుగ్రాసం కోసం ఎకరం భూమిలో 1500పెట్టుబడితో గడిజొన్నను నాటగా మూడు టన్నుల వరకు మేత వస్తుందంటున్నాడు శ్రీనివాసరెడ్డి. విత్తనాలు ఒకసారి వెదజల్లుతే రెండు దఫాల పశుగ్రసం వస్తుందంటున్నాడు.

అమృత ద్రావణం

కేవలం ఈ అమృత ద్రావణం కోసమే శ్రీనివాసరెడ్డి ఆవులను పెంచుతున్నాడు. ఆవు పేడ, మూత్రం ఉచితంగా లభిస్తాయి. వాటితో పాటు మాగిన సపోటా పండ్లు, వేప చెక్క, పప్పుల పొడి, నువ్వులనూనె, నల్లబెల్లం..ఈ పదార్థాలన్ని 200లీటర్ల నీటిలో కలిపి ఓ డ్రమ్ములో వేసి మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రతిరోజు రెండు నిమిషాలపాటు తిప్పాలి. నాలుగురోజుల తర్వాత ద్రావణం తయారవుతుంది. దీన్ని వడకట్టి ఏ పంటకైనా పిచికారీ చేయోచ్చు. 20 రోజులకు ఒకసారి ఇలా చేస్తే..మొక్కలకు కావాల్సిన నైట్రోజన్‌, పొటాషియం , సల్ఫర్‌, భాస్వరం సమృద్ధిగా దొరుకుతాయి.

శ్రీనివాసరెడ్డి చేసే సేంద్రియ వ్యవసాయానికి ఆకర్షితులై చుట్టుపక్కల రైతులు కూడా.. అతన్ని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.

శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ''ఒకరి కింద ఉద్యోగం చేయడం కన్నా..వ్యవసాయం చేయడం ఎంతో సంతృప్తిగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలనేది నా లక్ష్యం.'' అని అంటున్నాడు 

First published:

Tags: Nalgonda, Organic Farming

ఉత్తమ కథలు