Khammam : కరోనా రోగులకు అమ్మలా... ఎందరికో అదర్శంగా నిలుస్తున్న ముస్లిం మహిళా..

కరోనా రోగులకు అమ్మలా... ఎందరికో అదర్శంగా నిలుస్తున్న ముస్లిం మహిళా..

Khammam : సమాజపు కట్టుబాట్లు, ముస్లిం మైనారిటి మహిళా...అయినా.. ఇవేవి ఆమెను ఆపలేదు.. కరోనా కష్టకాలంలో నేనున్నాంటూ ముందుకు వచ్చింది.. కరోనా రోగులతోపాటు వారి కుటుంబాలకు నిత్యం అన్నదానం చేస్తూ...చివరికి కరోనా మృతులకు అంత్యక్రియలు కూడా నిర్వహిస్తోంది..దీంతో అందరి మన్ననలు పొందుతోంది.. పఠాన్‌ ఆషాఖాన్

  • Share this:
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

ఆమె పేరు పఠాన్‌ ఆషాఖాన్‌. సాధారణంగా మహమ్మదీయ స్త్రీ అనగానే పరదా.. కట్టుబాట్లు.. నిబంధనలు గుర్తొస్తుంటాయి. కానీ ఇక్కడ ఆమెకు తండ్రి నుంచి సంక్రమించిన సేవాభావం.. భర్త అర్థం చేసుకుని ఆదరించడంతో ఆమె మరింత సేవాభావంతో ముందుకు వెళ్తోంది. సత్తుపల్లి ఫుడ్‌బ్యాంకు పేరిట ఆమె కొన్నేళ్లుగా అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ఇక కోవిడ్‌ 19 కరోనా వైరస్‌ ధాటికి ఆసుపత్రుల పాలైన వారికైతే ఆమె అన్నపూర్ణే అయింది. ఆసుపత్రులకు, వారున్న ఐసోలేషన్‌ కేంద్రాలకు.. ఒకవేళ ఇంటివద్దే ఉంటే ఇంటికి తీసుకెళ్లి మరీ ఆహారం అందిస్తోంది. ఆమె ఇచ్చే ఆహారం సైతం సంపూర్ణ పౌష్టికాహారం.. రెండు పూటలా తాజా కూరగాయలతో .. నిత్యం గుడ్డు.. వారానికి రెండు సార్లు చికెన్‌తో .. కన్నతల్లిలా కరోనా పేషంట్లను ఆదరిస్తోంది.

ఇలా నిత్యం రెండొందల మందికి రెండు పూటలా భోజనం అందిస్తోంది. ఈ సేవలో ఆమె భర్త సైతం ప్రోత్సహించడమే కాకుండా నిత్యం ఆమె చేసే సేవా కార్యక్రమాల్లో చేయూత అందిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి మళ్లీ రాత్రి వరకు భోజనం తయారు చేయడం.. పంపడం.. కరోనా పేషంట్లకు ధైర్యం చెప్పడమే పని. కరోనా వచ్చిన వారి దగ్గరకు అయిన వారే వెళ్లడానికి భయపడుతున్న పరిస్థితుల్లో ఆమె పీపీఈ కిట్‌ ధరించి నేరుగా ఆసుపత్రులు, ఐసోలేషన్‌ వార్డుల్లోకి వెళ్లి వారికి భోజనం పెట్టడమే కాకుండా.. ఏంకాదు ధైర్యంగా ఉండండి. త్వరలో తగ్గిపోతుంది.. ఇంటికి వెళ్లొచ్చంటూ ధైర్యం చెబుతుంటారు. అలా ఆమె కరోనా రోగుల పాలిట ఆత్మబంధువులా మారారు.సత్తుపల్లికి చెందిన పఠాన్‌ ఆషాఖాన్‌ స్వతహాగా ఓ బ్యుటీషియన్‌. వృత్తిని నిర్వహిస్తూనే.. ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం ఓ ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఆమె భర్త ఖాన్‌ దర్జీగా పనిచేస్తారు. తాను సైతం భార్య చేస్తున్న సేవల పట్ల ఆసక్తితో తోడ్పాటును అందిస్తున్నారు. దీనికి గానూ ఆమె తనకు తెలిసిన స్నేహితులు, ఇంకా ఆమె సేవాభావం పట్ల ఆసక్తి ఉన్నవారితో ఓ బృందాన్ని తయారు చేసుకున్నారు.

సత్తుపల్లి ఫుడ్‌బ్యాంక్‌ పేరిట గత కొన్నేళ్లుగా ఆమె ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. పొద్దున్నే కూరగాయలు, వెచ్చాలు తెచ్చుకోవడం.. స్వయంగా వంట చేయడం.. ఎవరెవరికి అవసరమో వారికి ఇవ్వడం.. ఇక కరోనా సమయంలో ఆమె స్వయంగా టూవీలర్‌పై వెళ్లి ఇస్తుంది. ఇంకా ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులు, ఐసోలేషన్‌ సెంటర్లు, ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉన్నవారు.. ఇలా అందరికీ ఆమె స్వయంగా, భర్త సాయంతో భోజనాలు ఇస్తోంది.

మరోవైపు కరోనా కాటుకు బలైన అభాగ్యుల మృతదేహాలను సైతం తీసుకెళ్లడానికి, అంత్యక్రియలు చేయడానికి సొంతవాళ్లు సైతం ముందుకురాని పరిస్థితుల్లో ఆమె ముందుకొచ్చారు. చనిపోయిన వారి అంత్యక్రియలను వారి విశ్వాసాలకు అనుగుణంగా చేస్తున్నారు. ఇలా ఆమె చేస్తున్న సేవలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభినందించి కొంత ఆర్థిక సాయం కూడా అందించారు. ఎమ్మెల్యేతోపాటు పట్టణంలోని ముఖ్యులు, ఇంకా తాము నేరుగా సేవ చేయలేని వారు ఆమెకు తోడ్పాటును అందిస్తున్నారు.

మొత్తంమీద ఓ మహిళగా ఆమె కరోనా రోగులను ప్రేమగా ఆదరిస్తూనే, చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తన కార్యక్రమాలపై ఆషాఖాన్‌ 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ పదిమందికి సేవ చేయాలన్న ఆలోచనను తన తండ్రి నుంచి నేర్చుకున్నానని.. తనకు చేతనైనంత సాయం చేయడం ధర్మంగా భావిస్తున్నానన్నారు. భర్త సహకారంతోనే ముందుకెళ్తున్నానని, ఇంకా స్నేహితులు, ఇతరుల సాయం అందుతోందన్నారు. తన వృత్తిని చేసుకుంటూనే, సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతృప్తిగా ఉందన్నారు. తన కుటుంబపరమైన కట్టుబాట్లు, తాను చేస్తున్న సేవకు ఎన్నడూ అడ్డురాలేదని స్పష్టం చేశారు.
Published by:yveerash yveerash
First published: