news18-telugu
Updated: August 15, 2020, 4:56 PM IST
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్ కోసం హెలికాప్టర్‌తో గాలింపు
కుండపోత వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపైనా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మెదక్ జిల్లా కోహెడ మండలంలో ఓ లారీ వాగులో కొట్టుకుపోయింది. బస్వాపూర్ బ్రిడ్జిపై వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఐదారు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నా లారీ డ్రైవర్ శంకర్ అలాగే ముందుకెళ్లాడు. ఆ ఉద్ధృతి దాటికి ఇసుక లారీ వాగులో కొట్టుకుపోయింది. క్లీనర్ ఎలాగోలా ఒడ్డుకు చేరాడు. లారీ డ్రైవర్ ఓ చెట్టును పట్టుకొని అలాగే ఉండిపోయాడు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేశాడు. అప్పటికే ఒడ్డుకు చేరుకున్న లారీ క్లీనర్ స్థానికులకు సమాచారం అందించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గత ఈతగాళ్లు చేరుకొని లారీ డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొస్తున్న సమయంలో.. శంకర్ తాడును వదలిపెట్టాడు. ఆ వెంటనే వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మంత్రి హరీష్ రావు చొరవతో హెలికాప్టర్ కూడా తీసుకొచ్చారు. బస్వాపూర్ వాగు చుట్టుపక్కల ప్రాంతాల్లో హెలికాప్టర్‌తో గాలిస్తున్నారు.
కరీంనగర్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. ఐతే ఘటనా స్థలంలో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ రఘు, ఎస్ఐ రాజా కుమార్, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 15, 2020, 3:55 PM IST