చివరకు చిక్కకుండానే చిలుకూరుకెళ్లిన చిరుత.. మళ్లీ వచ్చే అవకాశం..

చిరుతపులిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోను

చివరకు చిరుత పాదముద్రలను ఫార్మ్ హౌస్‌లో గుర్తించిన అటవీశాఖ అధికారులు పోలీసుల డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు. నిన్న రోజంతా అక్కడే ఉండి, గత రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా, చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు.

 • Share this:
  హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన మైలార్ దేవరపల్లిలో గురువారం ఓ చిరుతపులి సంచరించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిరుతపులిని పట్టుకునేందుకు ఇటు అటవీశాఖ అధికారులు.. అటు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చిరుతపులిని పట్టుకునేందుకు గురు, శుక్రవారాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు. అయినా చిరుతపులి చివరకు చిక్కకుండానే శంషాబాద్ ప్రాంతం నుంచి చిలుకూరు వైపునకు వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుతపులిని పట్టుకునేందుకు గురువారం మొదలైన ఆపరేషన్ శుక్రవారం కూడా కొనసాగింది. శంషాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో జల్లెడ పట్టిన అధికారులు చిరుత జాడలను పాదముద్రల సహకారంతో గుర్తించారు. అది తిరిగిన ప్రాంతాల ఆధారంగా, నిన్నటి నుంచి గుర్తించే ప్రయత్నాలు చేశారు.

  పోలీసు శాఖ సహకారం తీసుకున్న అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శోధించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. చివరకు చిరుత పాదముద్రలను ఫార్మ్ హౌస్‌లో గుర్తించిన అటవీశాఖ అధికారులు పోలీసుల డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు. నిన్న రోజంతా అక్కడే ఉండి, గత రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా, చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన సీసీ కెమెరాల్లో చిరుతకు ఆహారంగా పనికి వచ్చే జంతువులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఆహారం కోసం అక్కడికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు దానిని బంధించేందుకు అవసరమైన బోనులను, సీసీ కెమెరాలను కొనసాగించాలని నిర్ణయించారు.

  అలాగే ఒక ప్రత్యేక పర్యవేక్షణ టీమ్‌ను, రెస్క్యూ గ్రూప్‌ను ఉంచనున్నారు. మళ్లీ చిరుత నగరం వైపు రాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు చిలుకూరు అటవీ ప్రాంతంలో నిత్యం నిఘా పెడతామని, ప్రజలను అప్రమత్తం చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. చిరుత ఆపరేషన్‌లో సహకరించిన పోలీసు శాఖకు, సిబ్బందికి అటవీశాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వ్యవసాయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత జాడలు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
  Published by:Narsimha Badhini
  First published: