చిరుత కలకలం.. వల నుంచి తప్పించుకుని పోలీసులపై దాడి..

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పోలీసులు, అటవీ శాఖ అధికారుల పైకి పంజా విసిరింది. పోలీసులపై దాడి చేసి గాయపర్చింది. చిరుతను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది.

news18-telugu
Updated: May 28, 2020, 12:37 PM IST
చిరుత కలకలం.. వల నుంచి తప్పించుకుని పోలీసులపై దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నల్లగొండ జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. వలలో చిక్కిన చిరుతపులిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో వల నుంచి తప్పించుకుంది. అనంతరం దాన్ని బంధించేందుకు వచ్చిన పోలీసులపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మర్రిగూడ మండలం రాజాపేటతండా శివారులో కొద్దిరోజులుగా పలుమార్లు చిరుత పులులు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనల్లోనే ఉంటున్నారు. పశువులు, మెట్ట పంటలను కాపాడుకునేందుకు రైతులు ఉచ్చులు వేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రైతులు వేసిన ఉచ్చుకు చిరుతపులి చిక్కుకుంది. దీంతో స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, మెడికల్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి.

చిరుతను పట్టుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చిరుతపులి వల నుంచి తప్పించుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పోలీసులు, అటవీ శాఖ అధికారుల పైకి పంజా విసిరింది. పోలీసులపై దాడి చేసి గాయపర్చింది. చిరుతను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు చిరుతను పట్టుకుని బంధించారు. గాయపడిన అధికారులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ చిరుతపులిని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన చిరుతపులిగా అధికారులు గుర్తించారు.

అధికారులు పట్టుకున్న చిరుతను హైదరాబాద్ జూపార్కుకు తరలించనున్నారు. అయితే జనవరి 16న ఇదే మండలంలోని అజలాపురంలో రైతు పెట్టిన ఉచ్చుకి మరో చిరుతపులి చిక్కిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలో సరైన వసతులు కల్పించకపోవడంతో ఆహారం కోసం వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని, క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు.
First published: May 28, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading