హోమ్ /వార్తలు /తెలంగాణ /

Agriculture News: దున్నపోతే కాడెడ్లుగా.. వ్యవసాయం చేస్తున్న రైతు.. ఎందుకో తెలుసా..

Agriculture News: దున్నపోతే కాడెడ్లుగా.. వ్యవసాయం చేస్తున్న రైతు.. ఎందుకో తెలుసా..

దున్నపోతుతో దుక్కి దున్నుతున్న రైతు

దున్నపోతుతో దుక్కి దున్నుతున్న రైతు

Agriculture News: వ్యవసాయం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. దుక్కిదున్నడం మొదలు కొని విత్తనాలను విక్రయించే వరకు పెట్టుబడి పెట్టాల్సిందే. ఇలాగే ఓ రైతు దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కు కిరాయి ఇచ్చే స్థోమత లేక, సొంత ఎడ్లను కొనేంత డబ్బులు లేకపోడంతో దున్నపోతుతో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(కట్టాలెనిన్, ఆదిలాబాద్, న్యూస్18 తెలుగు) 

ఎద్దులు లేనిది యెవుసం లేదు. వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి ప్రతేకంగా చెప్పనక్కర లేదు. దుక్కులు దున్నడం మొదలు పంట పొలాన్ని చదును చేయడం, సారలు పెట్టడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం ఇలా ఏ పని చేయాలన్నా ఎడ్లకు అరక కట్టి చేయాల్సిందే. వ్యవసాయం పనుల్లో రైతులు చేదోడు వాదోడుగా ఉండే కాడెడ్లకు కరువచ్చింది. అయితే కొందరు రైతులు ఈ మధ్య కాలంలో ఎడ్లను అద్దెకు కూడా తెచ్చుకొని వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న రైతులైతే ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను వినియోగిస్తున్నారు. అయితే అద్దె భారంకావడం, స్వంత ఎడ్లను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని రైతులు మాత్రం కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి తన వద్ద ఉన్న దున్నపోతుతో వ్యవసాయ పనులు చేసుకుంటూ అందరిని అకట్టుకుంటున్నాడు. అది ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ గ్రామం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ గ్రామానికి చెందిన మిర్జా యూసుఫ్ బేగ్ అనే రైతు తన ఐదేకరాల పొలంలో ఒక ఎకరం చెరుకు సాగు చెయగా, మరో నాలుగెకరాలలో పత్తి సాగు చేశాడు.

మే నెలలో ట్రాక్టర్ సహాయంతో భూమి దుక్కి దున్నించాడు. జూన్ నెలలో వర్షాలు కురవగానే పత్తి విత్తనాలు నాటాడు. ప్రస్తుతం పొలంలో కలుపు తీసేందుకు తన వద్ద ఎడ్లు లేక, కరోనా కష్టకాలంలో ఎడ్ల జత కొనాలంటే 90 వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని, అన్ని డబ్బులు పెట్టాలంటె భారమవుతుందని భావించి తనకు వచ్చిన ఆలోచనతో ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. తనకున్న డైరీ ఫామ్ లోని ఓ దున్నను ఉపయోగించి వ్యవసాయ పనులు కానిచ్చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఓ డౌర కొట్టే పరికరాన్ని తయారు చేయించాడు. దున్న ముక్కుకు మూకుతాడు బిగించి ప్రత్యేకంగా ఈ డౌరను దున్న మెడకు బిగించి దాని సహయంతో డౌర కొడుతు కలుపు తీయిస్తున్నాడు. ఇందు కోసం ఆ దున్నకు తర్ఫీదు కూడా ఇచ్చాడు. వ్యవసాయ పనులు అలవాటైన ఆ దున్నతో గత రెండు మూడు రోజులుగా పొలంలో డౌర కొడుతున్నారు. డౌర కొట్టేందుకు ఎద్దులు కొనాలంటే ఈ మధ్య చాలా కష్టంగా ఉందని అసలే కరోనా వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, అలాంటి తరుణంలో తమ వద్ద డైరీ ఫాం లో ఉన్న ఓ దున్నపోతును పెంచి పెద్ద చేయగా అది ప్రస్తుతం తమకు ఇలా ఉపయోగపడుతోందని రైతు యూసుఫ్ బేగ్ అంటున్నాడు.

దీని వల్ల తమకు ఖర్చులు కూడా తగ్గాయని, ప్రత్యేకంగా దున్నకు మెడలో వేసేందుకు ఓ పరికరాన్ని తయారు చేయించి దున్న సహయంతో పొలంలో కలుపు తీస్తున్నామని చెప్పుకొచ్చారు. దున్నలను ఎవరు కూడా చిన్నతనంలోనే ఇది దున్న కదా అని పదిహేను వందలు రెండువేలకు అమ్మేస్తుంటారని అలా అమ్మేయకుండా వాటిని పెంచి పోషిస్తే అవి పెద్దయ్యాకా ఇలా చేలల్లోను దన్నేందుకు పనికొస్తాయని తాను చేసిన ఈ చిన్న ప్రయోగం తమ వ్యవసాయ సాగుకు ఎంతో పనికొచ్చిందని రైతు యూసూఫ్ బేగ్ వివరించాడు. కేవలం ఒక రోజు మాత్రమే దున్నకు ట్రేయినింగ్ ఇచ్చామని ఆ తరువాత అది అలవాటు పడిందని, దానికి కొత్తగా ఉన్నందున తమ మనిషిని ముందు పెట్టి రోజూ దున్నను ఒకరు లాగిస్తు తీసుకొని ముందుకెళితే మరొకరు వెనుక నుండి కలుపు తీసే పరికరంతో ఇలా పని చేస్తున్నారని ఇలా తమ వ్యవసాయ పనులను ఒడ్డెక్కించ్చుకుంటున్నామని రైతు యూసుఫ్ బేగ్ తెలిపారు.

First published:

ఉత్తమ కథలు