Boy Sell : ఆడపిల్ల@ 3000 అయితే.. మగపిల్లవాడు@15000..! అంగట్లో అమ్మ ప్రేమ...

Boy Sell : ఆడపిల్ల@ 3000 అయితే.. మగపిల్లవాడు@15000..! అంగట్లో అమ్మ ప్రేమ...

Boy Sell : ఏడు రోజుల ఆడపిల్లను కేవలం మూడు వేల రూపాయలకు అమ్మకానికి పెట్టిన ఓ అమ్మ సంఘటన మరచిపోకముందే.. మరో అమ్మ తన ఏడు సంవత్సరాల కొడుకును పదిహేను వేల రూపాయలకే అమ్మివేసిన సంఘటన మెదక్‌లో వెలుగు చూసింది.

 • Share this:
  సృష్టిలో అమ్మ ప్రేమ ఒక్కటే చాలా స్వచ్చమైనదని...దాన్ని ఎవరు కొనలేరనేది చారిత్రక సత్యం.. అమ్మ ఏది ఆశించదు...పైగా తన సర్వస్వాన్ని పిల్లలకే దారపోస్తుంది..కాని.. మారుతున్న కాలంలో తల్లి ప్రేమ అంగడి బజారులో కొనుగోలు వస్తువుగా మారుతోంది. ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తమ సంతానాన్ని ఏకంగా అమ్మేస్తున్నారు..ఎంత కష్టం వచ్చినా.. తన కాళ్లమీద నిలబడాల్సిన అమ్మ గుండే, కర్కశంగా మారి పసిపిల్లల్ని అమ్మేందుకు బజారులో బేరం పెడుతోంది.

  మెదక్ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఎర్రపోచమ్మ అనే మహిళకు పది సంవత్సరాల వయస్సు గల శ్రీశైలం, 7 సంవత్సరాల వయస్సున్న మహేష్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా ఆమెను గత ఐదు సంవత్సరాల క్రితం భర్త వదిలివేశాడు. దీంతో పోచమ్మ తన తల్లి అక్కమ్మతో కలిసి చిన్నచింతకుంట గ్రామంలో ఉంటుంది. అయితే పిల్లల్ని అమ్మమ్మ వద్దే వదిలి ఉపాధి నిమిత్తం పలు ప్రాంతాలు తరచుగా తిరిగి వస్తుంది.

  ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్లిన పోచమ్మ ఇటివలే తన పెద్ద కొడుకు శ్రీశైలం మాత్రమే వెంటబెట్టుకుని వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి అక్కమ్మ చిన్న కొడుకు మహేష్ ఎక్కడని నిలదీసింది. అయితే.. ఆమె, పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో మరింత అనుమానం వచ్చిన తల్లి అక్కమ్మ వెంటనే ..స్థానిక పోలీసులతో పాటు ఐసిడిఎస్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది.

  పోలీసులు పోచమ్మను విచారించగా అవే పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చి తమ స్టైల్లో విచారించారు. పోచమ్మ నిజాన్ని ఒప్పుకుంది. బాబును ఓ మధ్యవర్తి ద్వారా 15వేల రూపాయలకు అమ్మినట్టు చెప్పింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక బాబు మిస్సింగ్‌పై ఐసిడిఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

  కాగా రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లకు చెందిన ఓ తల్లి తన ఏడు రోజుల ఆడపిల్లను కేవలం మూడు వేల రూపాయలకే అమ్మింది..అయితే వెంటనే తేరుకున్న ఆమె తన కూతురును తిరిగి ఇచ్చివేయమని కోరడంతో బిడ్డను కొనుక్కున్న మహిళ నిరాకరిస్తూనే.. పదివేల రూపాయలు ఇస్తే బిడ్డను అప్పగిస్తానని చెప్పడంతో డబ్బులు చెల్లించలేని ఆ తల్లి స్థానికంగా ఉన్న అంగన్‌వాడి వర్కర్లకు ఫిర్యాదు చేసింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పాపను స్వాధీన పరుచుకున్నారు.

  ఇలా అమ్మ ప్రేమలు అమ్ముడుపోవడం..కనీసం తమ పిల్లల్ని పోషించలేని స్థితికి వెళ్లడం భవిష్యత్ పరిణామాలకు మంచిది కాదనే అభిప్రాయాన్ని పలువురు సామాజిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఇలా అమ్మడం ద్వారా వాళ్లు ఎలా మారతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిల్లలు లేని వారైతే...మంచిదే...కాని సమాజ వ్యతిరేకులకు ,విచ్చిన్న శక్తుల చేతిలో పడితే..వారి భవిష్యత్ ఎలా ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
  Published by:yveerash yveerash
  First published: