తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు చాలా సందర్భాల్లో గుర్తుచేస్తుంటారు. అలాంటి ఘటనే మహాబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అత్తా కోడళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ పసిపాప ఉసురు తీసింది. తల్లి ఆవేశాం చిన్నారి ప్రాణాలను బలితీసింది. జిల్లాలోని గండీడ్ మండలం జక్షపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. జక్షపల్లి గ్రామానికి చెందిన అంజయ్య, సంతోషిలకు కొన్నేళ్ల కిందట పెళ్లైంది. వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది. అంజయ్య గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి వంట చేసే సమయంలో సంతోషికి ఆమె అత్తకు మధ్య గొడవ మొదలైంది. గొడవ జరుగుతున్న సమయంలో సంతోషి కుమార్తె.. ఆమె అత్త ఒడిలో ఉంది. ఈ గొడవ కాస్తా పెద్దదై ఘర్షణకు దారితీసింది.
ఘర్షణ జరుగుతుండగానే తీవ్ర ఆవేశానికి లోనైన సంతోషి.. అత్త వద్ద నుంచి చిన్నారిని లాక్కొని నేల కేసి విసిరింది. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయం కావడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన చిన్నారి తండ్రి అంజయ్య.. చుట్టుపక్కల వారి సహాయంతో పాపను కోస్గి మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప చనిపోయినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Published by:Sumanth Kanukula
First published:December 12, 2020, 09:07 IST