(K. Veeranna, News 18, Medak)
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు నడవరా ముందుకు.. అన్నారో సినీ కవి. ఇదే బాటలో నడుస్తూ ఒకరి స్ఫూర్తిగా మరొకరు సర్కారు కొలువులు సాధిస్తుండటం విశేషం. ఒక్కరు సాధించిన ప్రభుత్వ ఉద్యోగం (government jobs) ఆ పల్లెల్లో మిగతావారిలో స్ఫూర్తి నింపింది. ఓ వైపు పేదరికంతో సతమతమవుతున్నా తమ కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యమే ముందుకు నడిపించింది. లక్ష్యాన్ని సాధించేందుకు ప్రేరేపించింది. లక్షలాది మంది పోటీల్లో ఉన్నా పట్టుదలతో చదివి కొలువులు (Jobs) సాధించారు. సీనియర్ల అండతో పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తూ ఆదర్శంగా నిలవడం విశేషం. ఇలా ఆయా గ్రామాల్లో ఇంటికో ఉద్యోగిగా (Employees village) స్థిరపడ్డారు.
పోటీ పరీక్షల ఫలితాల్లో ఒక్కరైనా..
ఉపాధ్యాయులుగా (Teachers) ఎదగాలన్న ఆకాంక్ష పెరిగింది. ఒకరిని చూసి మరొకరు ముందడుగు వేశారు. అలా ఉపాధ్యాయుల ఖిల్లాగా మారింది. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామం (Akkannapeta Village). ఇక్కడి వారు 80 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారుండటం గొప్పవిషయం. 1960 కంటే ముందే కొలువులు సాధించారు. ఇంకొంత మంది రైల్వే, పోలీస్, అటవీ, వీర్వో, పంచాయతీ కార్యదర్శి వంటి ఉద్యోగాలు సాధించారు. పోటీ పరీక్షల ఫలితాల్లో ఇక్కడి వారు ఒక్కరైనా ఉంటూ వస్తుండటం గమనార్హం. గ్రామానికి చెందిన రాంచందర్ 1982లోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. ఈయన యువకులను ప్రోత్సహించారు. అన్ని రకాలుగా శిక్షణ ఇస్తూ వచ్చారు.
మహ్మదాబాద్‌లో..
మెదక్ (Medak) జిల్లాలో నర్సాపూర్ మండలం మహ్మదాబాద్ (Mahmadabad) తండా.. మారుమూల గ్రామం. ఇక్కడి వారెంతోమంది చదువుల్లో రాణించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటికో ఉద్యోగి ఉన్నారంటే ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. నర్సాపూర్‌కు 5 కి.మీ. దూరంలో ఉండటంతో చదువుపై ప్రత్యేక దృష్టిసారించారు. వారంతా నడుచుకుంటూ వచ్చి చదువుకున్న వారు కావడం గమనార్హం.
ఈ ప్రాంతానికి చెందిన ఛత్రూనాయక్ ప్రస్తుతం ఎఫ్‌సీఐలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతడి సోదరుడు ఆర్అండ్్బలో రాజునాయక్ జూనియర్ టెక్నికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యాయులుగా, బ్యాంకుల్లో విద్యుత్తు, రైల్వే శాఖల్లో పని చేస్తూ. కుటుంబాలకు అండగా నిలిచారు. తొలి దశలో ఉద్యోగాలు సాధించిన వారు అన్ని రకాలుగా రాణిస్తున్నారు.
మహబూబాబాద్‌లో..
ఇదే మాదిరిగా వరంగల్‌లోని ఓ గ్రామం కూడా ఉద్యోగుల ఖిల్లాగా ఉంది. అక్కడున్నవి 300 కుటుంబాలే, మొత్తం జనాభా 1,650కి మించదు. కానీ ఆ ఊరిలో 150 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు. 50 మంది పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు. వీళ్లను ఆదర్శంగా తీసుకొని మరో 50 మంది విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఆ ఊరే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లా తండా. శాస్త్రవేత్తలు మొదలుకొని డాక్టర్లు, ఇంజినీర్ల దాకా.. కానిస్టేబుల్ మొదలుకొని ఐజీ దాకా.. బ్యాంకులు, అటవీ శాఖ, రైల్వే, విద్య, విద్యుత్తు తదితర శాఖల్లో చాప్లా తండా ఉద్యోగులున్నారు.
గ్రామానికి చెందినవాళ్లు అమెరికా, కెనడా, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు 30 మందికి పైగా విదేశాల్లో స్థిరపడి ఉన్నత రంగాల్లో పనిచేస్తున్నారు. చాప్లా తండా నుంచి ఏటా ఐదారుగురు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ తండా వాసులు రాజకీయంగానూ రాణిస్తున్నారు. ఇక్కడి నుంచే డోర్నకల్‌కు ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ డైరెక్టర్లు, సింగిల్‌విండో చైర్మెన్లుగా పదవులు చేసినవారున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Government jobs, Medak