తెలంగాణలోకి కరోనా ప్రవేశించి 6 నెలలవుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో మార్పురాలేదు. వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నా భయపడడం లేదు. మాస్క్లు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. సంచరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పక్కనబెట్టి ఇష్టానుసారంగా తిరగడంతో.. చాలా మందికి కరోనా వ్యాప్తి చెందుతోంది. తమకు తెలియకుండానే ఇతరులకు కరోనా వైరస్ను అంటిస్తున్నారు. తెలంగాణలో తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. పింఛన్లు అందజేసే వ్యక్తి నుంచి ఓ గ్రామంలో 54 మందికి కరోనా సోకింది. ఒక్కడి నుంచి అంత ఏకంగా మందికి కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో ఈ ఘటన జరిగింది.
గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దదగడలో 5 రోజుల క్రితం ఓ ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తి పించన్లను పంపిణీ చేశాడు. ఆ తర్వాత అతడి ఇంట్లో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల్లో 9 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామంలోని 250 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా మొత్తం 54 మందికి కరోనా సోకినట్లు బయటపడింది. ఐతే వారిలో కరోనా లక్షణాలు లేకపోవడంతో హోంఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,018కి కరోనా నిర్ధారణ కాగా.. మరో 10 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 780కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు మరింత తగ్గి 0.69 శాతానికి చేరింది. దేశంలో అది 1.84 శాతంగా ఉంది. 24 గంటల్లో తెలంగాణలో 1060 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 85223కి చేరింది. రికవరీ రేటు 76.30గా ఉంటే... దేశంలో అది... 75.92 శాతంగా ఉంది. తెలంగాణలో యాక్టివ్ కేసులు 25685 ఉన్నాయి. వాటిలో 19113 మంది ఇళ్లలోనే ఉంటూ... ట్రీట్మెంట్ పొందుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.