‘మా గ్రామాలు కూడా తెలంగాణలో కలపండి సార్..’ హరీశ్ రావుకు మహారాష్ట్రలోని 42 గ్రామాల విజ్ఞప్తి

హరీశ్‌రావుకు వినతిపత్రం అందిస్తున్న 42 గ్రామాల ప్రతినిధి బృందం

తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్రకు చెందిన 42 గ్రామాలకు చెందిన వారు కోరారు.

  • Share this:
    తెలంగాణలో సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారని, అలాంటి సంక్షేమాలు పొందేందుకు తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్రకు చెందిన 42 గ్రామాలకు చెందిన వారు కోరారు. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కలసి విజ్ఞప్తి చేశారు. ‘మా గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో కలపండి.. మాకు మీ సంక్షేమ పథకాలు వర్తించేలా చూడాలి.’ అని వారు కోరారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన 42 గ్రామాలకు చెందిన ప్రతినిధులు గురువారం సిద్దిపేట వచ్చి మంత్రి హరీష్ రావుని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు చెందిన వారిమని తెలిపారు. ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని తమ 42 గ్రామాలను కూడా తెలంగాణ రాష్ట్రం లో కలపాలని మంత్రి హరీష్ రావుని కలిసి కోరినట్టు చెప్పారు. తాము మహారాష్ట్రలో ఉన్నామన్న మాటే కానీ అక్కడ తమకు ఎలాంటి సౌకర్యాలు, పథకాలు లేవని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణలో అద్భుతమైన సంక్షేమ పథకాలు చేస్తున్నారని చెప్పారు. కల్యాణ లక్ష్మీ ,కేసీఆర్ కిట్, రైతు బంధు, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారని, తమను కూడా తెలంగాణ రాష్ట్రం లో కలపాలని కోరారు. ఆ పథకాలు తమకు కూడా వర్తింప జేయాలని వారు కోరారు. 42 గ్రామాలు తీర్మానం చేసిన కాపీలను మంత్రి హరీష్ రావుకి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని, తెలంగాణ సంక్షేమ పథకాల అమలు పట్ల వారు చూపించిన స్ఫూర్తి అభినందనీయమని మంత్రి హరీష్ రావు అన్నారు. వారి విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రి హరీష్ రావు ని కలిసిన వారిలో రాజ్ లింగారెడ్డి , శంకర్ శెట్టి , బాలాజీ తదితరులు ఉన్నారు.

    తెలంగాణలో 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇటీవల ఏడాది పూర్తయింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, మన ఊరు - మన ప్రణాళికలాంటివి అమలు చేస్తోంది. స్త్రీ, శిశు సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, కంటి వెలుగు లాంటివి తీసుకొచ్చింది. పింఛన్లను కూడా అందిస్తోంది. విద్యార్థులకు స్కూళ్లు, హాస్టళ్లు, సన్నబియ్యంతో భోజనం వంటివి కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: