సింగరేణి బొగ్గు గనులకు సంబందించి ఇటీవల కాలంలో పెద్ద విషాదం ఇవాళ చోటుచేసుకుంది. భూగర్భ బొగ్గు గని(అడర్ గ్రౌడ్ కోల్ మైన్)లో పనిచేస్తోన్న కార్మికుల మీదికి పైకప్పు కుప్పకూలడంతో నలుగురు దుర్మరణం చెందారు. కూలిన శిథిలాలు భారీగా ఉండటంతో మృతదేహాలను వెలికి తీయడం కూడా కష్టమైపోయింది. ఈ ఘటన శ్రీరాంపూర్ లోని ఎస్ఆర్పీ-3 గనిలో జరిగింది. వివరాలివి..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్పీ 3 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఫస్ట్ షిఫ్టులో డ్యూటీకి దిగిన కార్మికులు.. 21 డీప్ 24 లెవెల్ వద్ద పిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా రూఫ్ కుప్పకూలింది. భారీ పెల్లలు మీద పడటంతో నలుగురు కార్మికులూ అక్కడిక్కడే చనిపోయారు.
ప్రమాదం గురించి తెలియగానే గనిలో పనిచేస్తోన్న ఇతర కార్మికులు, పై నుంచి అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు, రెస్క్యూ సిబ్బంది సైతం రంగంలోకి దిగింది. బొగ్గు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.
ఎస్ఆర్కే-3 గనిలో మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మృతి చెందిన కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్‌లుగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంపై సింగరేణి కార్మిక సంఘాలు, మృతుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Coal, Mancherial, Singareni, Singareni Collieries Company