నవరాత్రుల సందర్భంగా గ్రామంలో అమ్మవారిని ప్రతిష్టించి, విశేష పూజలు సమర్పించి, చివరిరోజైన దసరా సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళుతూ గ్రామస్తులు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం..
ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ లో ప్రయాణించినవారంతా కమలాపురం వాసులే. గ్రామంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు...
గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో మున్నేరు నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కమలాపురం వాసులు రెండు ట్రాక్టర్లలో బయలుదేరగా మార్గం మధ్యలో బాణాపురం వద్ద ప్రమాదం జరిగింది. విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోగా, వెనుక గ్రామస్తులతో నిండి ఉన్న మరో ట్రాక్లర్ వల్లభి వైపు వెళ్లింది. ట్రాక్టర్ వేగానికి తోడు వర్షం కురుస్తుండటంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది..
ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరికొందరిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పండుగవేళ ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Mudigonda, Road accident