Home /News /telangana /

బోరువేసిన అరగంటలోనే ప్రమాదం.. తమ పొలంలోనే ఘటన

బోరువేసిన అరగంటలోనే ప్రమాదం.. తమ పొలంలోనే ఘటన

బోరుబావిలో పడిన బాబు

బోరుబావిలో పడిన బాబు

    మెదక్ జిల్లాలో బారు బావిలో చిన్నారి పడిన విషయం తెలిసిందే. ఐతే బుధవారమే బోరువేసినట్లు అధికారులు గుర్తించారు. బోరు వేసిన అరగంటలోనే.. ప్రమాదవశాత్తు చిన్నారి అందులో పడిపోయినట్లు తల్లిదండ్రులు చెప్పారు. పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన భిక్షపతి బుధవారం తన పొలంలో బోర్లు వేశాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో మూడో బోరు బావిని కూడా తవ్వించారు. ఐతే ఆయన మనవడు సాయి వర్ధన్ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చాడు. బోర్లు వేసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో.. అతడు ఆడుకుంటూ వెళ్లి ఓ బోరుబావిలో పడిపోయాడు. వారి పొలంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. తాత భిక్షపతి, తండ్రి గోవర్ధన్ కళ్ల ముందే అందులో పడ్డాడు. చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నంలో కొంత మట్టి కూడా బాలుడిపై పడినట్లు తెలుస్తోంది. బోరుబావులను పూడ్చే లోపే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటు బోరుబావికి సమాంతరంగా పొక్లైనర్‌లతో గొయ్యి తవ్వుతున్నారు. బాలుడికి ఆక్సీజన్ అందేలా.. బావి లోపలికి సిలిండర్ల ద్వారా ఆక్సీజన్ అందిస్తున్నారు. 120 అడుగుల లోతున్న బోరుబావిలో ప్రస్తుతం 20 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమ బాబు పరిస్థితిని తలచుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బోరుబావి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది. ఈ ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బాలుడు క్షేమంగా తిరిగి రావాలని అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Borewell, Medak, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు