లోన్ యాప్ వేధింపుల (Loan Apps Harassments)కు మరొకరు బలయ్యారు. సిబ్బంది వేధింపులకు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శివ(20) ఆన్ లైన్ యాప్ ద్వారా 8వేల రూపాయల లోన్ (Online Loan) తీసుకున్నాడు. ఐతే ఆర్థిక ఇబ్బందులతో గడువు లోపు తిరిగి కట్టలేకపోయాడు. దాంతో అతడికి భారీగా ఫైన్ విధించారు. రూ.20వేలు కట్టాలని లోన్ యాప్ సిబ్బంది వేధించడం మొదలుపెట్టారు. నిత్యం ఫోన్ చేసి వేధించడంతో అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గత రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి లోన్ యాప్ సిబ్బంది వేధింపులే కారణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అటు కేంద్రం కూడా చట్ట విరుద్దమైన లోన్ యాప్‌లపై దృష్టి సారించింది. లోన్ యాప్స్‌పై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్బీఐని కేంద్రం ఆదేశించింది. వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్లలో ఉండాలి.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ కూడా దృష్టి సారించాలని సూచించారు. అక్రమ లోన్ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు.. అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ సమావేశంలో కేంద్రం నిర్ణయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News