news18-telugu
Updated: November 19, 2020, 10:38 AM IST
ప్రతీకాత్మక చిత్రం
18 నెలల పసిబాలుడు ఇంటి ఆవరణలోనే కన్నుమూశాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నీళ్ల బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్తండాలో బుధవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బామన్ జగదీశ్, సీతాబాయి దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 18 నెలల బాలుడు శ్రీగోపాల్ ఉన్నాడు. ఐతే బుధవారం సాయంత్రం బాల్‌తో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి పనులు చేసుకుంటున్నారు.
ఐతే శ్రీగోపాల్ ఆడుకుంటూ వెళ్లి సగం నీరు ఉన్న బకెట్లో పడిపోయాడు. అందులో తలకిందులుగా పడిపోవడంతో ముక్కూ, నోరూ నీటిలో మునిగిపోయాయి. ఊపిరాడక అందులోనే మరణించాడు ఆ పసిబాలుడు. కాసేపటి తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లిదండ్రులకు శ్రీగోపాల్ కనిపించలేదు. ఇంటి ప్రాంగణమంతా వెతకగా.. బకెట్లో విగత జీవిగా పడిఉన్నాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించిన చిన్నారి.. అంతలోనే చనిపోవడంతో.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారి రోదనలను చూసి చుట్టు పక్కల వారు కూడా కంటతడిపెట్టారు. బాబు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముుకున్నాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
November 19, 2020, 10:34 AM IST