(K.Lenin,News18,Adilabad)
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాల్లో ఉండి చదువుకునే విద్యార్ధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల చిన్నచూపు కారణంగా వాళ్లు అనారోగ్యం పాలవుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి ఇది. జిల్లాలో ప్రతిరోజు ఏదో హాస్టల్, గురుకుల పాఠశాలలో ఒకరో, ఇద్దరో విద్యార్థులు అనారోగ్యంపాలై ఆసుపత్రి బాటపడుతున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలను కూడా కోల్పోయారు. తాజాగాకొమురంభీం ఆసిఫాబాద్(Komurambheem Asifabad)జిల్లా కౌటాల(Kautala)మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ గురుకుల (Kasturbha Gandhi Gurukulam)విద్యాలయంలో శుక్రవారం పదిహేను మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
15మందికి అస్వస్థత..
ముఖ్యంగా విద్యార్ధులు తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ ఉండటంతో విద్యార్థులను చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ లో తరలించారు. ఇంజక్షన్లు చేయించి, గ్లూకోజ్ ఎక్కించి తిరిగి కస్తూర్భాగాంధీ విద్యాలయానికి విద్యార్థులను తీసుకువచ్చారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి పరీక్షకు పంపించామని, కొందరికి ఇంజక్షన్లు చేసి, సెలైన్ ఎక్కించామని, చికిత్స కూడా అందించామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు పల్లవి పేర్కొన్నారు.
ఆందోళనలో తల్లిదండ్రులు..
ఇదిలా ఉంటే ఈ ఘటనకు ఒకరోజు ముందే అంటే గురువారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి మరో విద్యార్థిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థకు గురైన ఇద్దరు విద్యార్థినుల్లో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతున్న అనూష, మరొకరు ఆరవ తరగతి చదువుతున్న స్వాతి, అనూష స్వస్థలం ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం కాగా, ఉన్నారు. అనూష స్వస్థలం స్వాతి స్వస్థలం రెబ్బెన. ఇదిలా ఉంటే కాగజ్ నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థిని ఐశ్వర్య మృతి చెందిన ఘటనలో నలుగురిపై వేటు పడింది.
పిల్లల ప్రాణాలంటే అంత చిన్నచూప..
విద్యాలయం ప్రత్యేకాధికారి స్వప్న, డ్యూటీ టీచర్ శ్రీలత, పీఈటీ పార్వతి, ఎఎన్ఎం భారతిలను తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి భిక్షపతి గురువారం సాయంత్రం విద్యాలయానికి వెళ్లి తొలగింపు ఉత్తర్వులను వారికి అందించారు. పీఈటీ పార్వతి తాత్కాలిక పద్దతిలో విధుల్లో కొనసాగుతుండడంతో ఆమెను పూర్తిగా విధుల నుండి తొలగించారు. ఎస్ఓ స్వప్న, డ్యూటీ టీచర్ శ్రీలత, ఎఎన్ఎం భారతిలను ప్రస్తుతానికి విధుల నుండి తొలగించారు. విద్యాలయంలో సీనియర్ ఉపాధ్యాయురాలికి ఇంచార్జి స్పెషల్ అధికారిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎంఈఓ భిక్షపతి తెలిపారు.
హాస్టల్స్‌లో మారని తీరు..
అస్వస్థతకు గురైన విద్యార్ధులను గంగాపూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని బిజెవైఎం నాయకులు పరామర్శించారు. విద్యాలయంలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేవన్న సమాచారంతోనే తాము విద్యాలయాన్ని పరిశీలించామన్నారు.విద్యార్థులకు ఇచ్చే అతి ముఖ్యమైన పారసిటమల్ ట్యాబ్లెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు లేవని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం పెట్టడం లేదని, వారం పది రోజుల క్రితం వచ్చిన కోడిగుడ్లను విద్యార్థులుకు ఇస్తున్నారని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గంగాపూర్ కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Hostel students, Telangana News