దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుమారు వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో జనం జీవనం స్తంభించిపోయింది. వరదల ధాటికి వాగులు, వంకలతో పాటు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలన్నీ వరద నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా అన్నీ తడిసి ముద్దవుతున్నాయి. ఈ క్రమంలో జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలో పలువురు రైతులు వాగులో చిక్కుకుపోయారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. కుందనపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పొలాల్లో ఉన్న మోటర్లను తీసుకొచ్చేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో చలి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏ మాత్రం దిగినా కొట్టుకుపోయేంతలా మహోగ్రరూపం దాల్చింది. దాంతో 12 మంది రైతులు అక్కడే చిక్కుకుపోయారు. తమను కాపాడాలంటూ స్థానిక నేతలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు రైతులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అక్కడి పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌కు సమాచారం అందించారు. హెలికాప్టర్ వస్తే తప్ప వారిని కాపాడలేమని తెలిపారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌ను జయశంకర్ జిల్లా టేకుమట్ల ప్రాంతానికి పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Monsoon rains, South West Monsoon, Telangana