'స్పానిష్ మసీదు' సందర్శకులకు అనుమతి!

హైదరాబాద్‌ బేగంపేటలోని స్పానిష్ మసీదుకు 112 ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ మసీదును సామాన్యులు సందర్శించొచ్చు.

news18-telugu
Updated: August 13, 2018, 12:30 PM IST
'స్పానిష్ మసీదు' సందర్శకులకు అనుమతి!
image: Wikimedia Commons
  • Share this:
హైదరాబాద్... వారతస్వ సంపదకు, చారిత్రక కట్టడాలకు నిలయం. చార్మినార్, గోల్కొండ, మక్కామసీద్... ఇలా చెప్పుకుంటూ పోతే నగరం నలువైపులా ఎన్నో ఆకర్షణలున్నాయి. అవన్నీ టూరిస్ట్ స్పాట్స్‌గా మారాయి. ఇక నగరం నడిబొడ్డున బేగంపేటలో స్పానిష్ మసీదు ఉంది. 1906లో నిర్మించిన ఈ మసీదుకు 112 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకు అన్యమతస్తులకు అనుమతి లేదు. కానీ తొలిసారిగా ఆ అవకాశం కల్పించబోతున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ మసీదును సామాన్యులు ఎవరైనా సందర్శించొచ్చు. దేశ సమగ్రత, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 'విజిట్ మై మాస్క్' కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని మతాల వారిని మసీదు లోపలికి అనుమతిస్తారు.

'విజిట్ మై మాస్క్' కార్యక్రమంలో భాగంగా అన్ని మతాలవారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో చాలా దురభిప్రాయాలున్నాయి. ప్రజల మధ్య అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. వాటన్నింటిని తొలగించేలా మేం ప్రజలందర్నీ ఒకే దగ్గరకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది అన్ని మతాల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది. జాతీయ సమగ్రత, మతసామరస్యాన్ని ప్రచారం చేస్తుంది. భారతీయ ముస్లిం ప్రజల సంస్కృతి, విలువల్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
ఎం.ఏ. ఫైజ్ ఖాన్, పైగా వారసుడు, మసీదు ముతావళి


1887లో యూరప్‌లో పర్యటించిన పైగా నవాబు సర్ వికార్ ఉల్ ఉమెరా... స్పెయిన్‌లో మూరిష్ నిర్మాణాన్ని చూసి స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత అతని వారసుడు మూరిష్ నిర్మాణ శైలిని స్ఫూర్తిగా తీసుకొని 'స్పానిష్ మసీదు'ను 112 ఏళ్ల క్రితం 1906లో నిర్మించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు పైగా వారసులే ఈ మసీదు బాగోగులను చూస్తుండటం విశేషం. స్పానిష్ మసీదును జామా మసీద్ ఐవాన్-ఏ-బేగంపేట్ అని పిలుస్తుంటారు. దేశంలోని విభిన్నమైన మసీదుల్లో ఒకటిగా 'స్పానిష్ మాస్క్' పేరు తెచ్చుకుంది. 2010లో ఈ మసీదుకు ఇంటాక్ హెరిటేజ్ అవార్డ్ లభించింది.టర్కిష్ కాలిగ్రఫీతో ఇంటీరియర్ అద్భుతంగా ఉంటుంది. విభిన్నమైన మినార్లు, డోమ్‌తో హైదరాబాద్‌లో అరుదైన నిర్మాణం ఇది. ఈ మసీదును అన్ని మతాలవారు సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం మంచి ఆలోచన. ఒకరి మతం గురించి మరొకరికి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రజలు అక్కడికి వెళ్లి ఆ సుందర కట్టడం గురించి తెలుసుకోవడం సంతోషకరమైన విషయం.
పి.అనురాధ రెడ్డి, ఇంటాక్ కో-కన్వీనర్, తెలంగాణ


ఇతర మతస్తులు ఈ మసీదును సందర్శించేందుకు ఆగస్ట్ 15న మాత్రమే అవకాశముంది. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేశారు.
First published: August 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు