10 YEAR OLD BOY SAVED DOGS LIFE ONLINE CLASSES HELPED HIM TO DO SO INCIDENT IN SANGAREDDY DISTRICT MKS MDK
Sangareddy: ఈ బుడ్డోడి సమయస్ఫూర్తి ఓ ప్రాణాన్ని కాపాడింది.. ఆన్లైన్ క్లాసులు ఇలా కూడా ఉపయోగపడతాయి!
కుక్క ప్రాణాలు కాపాడిన కార్తీక్
ఆన్ లైన్ క్లాసుల ద్వారా లభించిన మొబైల్ పరిజ్ఞానం, సమయస్ఫూర్తితో పదేళ్ల బాలుడు ఓ కుక్కపిల్ల ప్రాణాలు కాపాడాడు. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోన్న కార్తీక్ ను అందరూ అభినందిస్తున్నారు..
(K.Veeranna,News18,Medak)
కరోనా విలయంలో ఆన్ క్లాసుల కారణంగా తప్పని సరిగా మొబైల్ వాడాల్సి రావడం పిల్లలపై చెడు ప్రభావాలు చూపుతోన్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. రెండంచులూ పదునైన కత్తి టెక్నాలజీ అన్నట్టు, అవే ఆన్ లైన్ క్లాసుల ద్వారా లభించిన మొబైల్ పరిజ్ఞానం, సమయస్ఫూర్తితో పదేళ్ల బాలుడు ఓ కుక్కపిల్ల ప్రాణాలు కాపాడాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్కు చెందిన పదేళ్ల బాలుడు కార్తీక్ చేసింది చిన్నపనే అయినా, గొప్పది కావడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ కు చెందిన కార్తీక్ స్థానిక సోషల్ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ లో ఐదో తరగతి చదువుతున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ పాఠాలు వింటోన్న కార్తీక్.. వీలున్నప్పుడల్లా తండ్రితో కలిసి పొలానికి వెళ్లి చిన్నపాటి పనులు చేస్తుంటాడు. సోమవారం కూడా ఆన్ లైన్ క్లాసులు పూర్తయిన తర్వాత కార్తీక్ తన తండ్రితో కలిసి పొలానికి వెళ్తుండగా.. దారి మధ్యలో ఓ బావిలో నుంచి అరుపులు వినిపించాయి..
ఇరవై అడుగులకుపైగా లోతున్న ఆ బావిలో ఓ శునకం పడిపోయి ప్రాణాపాయంలో అరుస్తుండటాన్ని కార్తీక్ గుర్తించాడు. దాన్ని బయటికి తీయడానికి తండ్రికొడుకులకు ఎలాంటి అధారం లేకపోయింది. ఆ క్షణంలోనే కార్తీక్ కు ఠక్కున ఐడియా వచ్చింది. తండ్రి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని.. ప్రాణాపాయస్థితిలో ఉన్న జంతువులను కాపాడే సంస్థ గురించి గూగుల్లో సర్చ్ చేశాడు. గూగుల్ సెర్చ లో హైదరాబాద్లోని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కనిపించగానే ఆసంస్థ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి కుక్క పరిస్థితి వివరించారు.
ప్రాణాపాయంలో ఉన్న కుక్క గురించి కార్తీక అందించిన సమాచారంతో సొసైటీ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వాహనంలో సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ కు చేరుకున్నారు. అవసరమైన సరంజామాను వెంట తెచ్చుకున్న సొసైటీ సభ్యులు చాకచక్యంగా కుక్కను బావిలో నుంచి బయటికి తీసి కాపాడారు.
యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులతో కార్తీక్
గురుకుల స్కూల్లో చదువుతోన్న తాను ఆన్ లైన్ క్లాసుల వల్ల మొబైల్ ను వాడాల్సి వస్తోందని, ఆ క్రమంలోనే ఏదైనా ఆపద వస్తే, ఏం చేయాలో తెలియని స్థితిలో గూగుల్ లో సెర్చ చేయొచ్చని ఐడియా తట్టిందని బుడ్డోడు కార్తీక్ చెప్పాడు. మూగ జీవి ప్రాణాలు కాపడేందుకు కార్తీక్ చేసిన ప్రయత్నాన్ని సొసైటీ సభ్యులతోపాటు ఊరివాళ్లంతా అభినందించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.