ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుమారు 10 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించారు. అయితే ఆమె రాత్రి 7 నుంచి 8 గంటల వరకే వస్తుందని అంతా భావించారు. కానీ వైద్యుల బృందం, తెలంగాణ అడిషనల్ ఏజీ, న్యాయవాదులు వెళ్లడంతో అసలు లోపల ఏం జరుగుతుందో అనే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇక మధ్యలో వర్షం పడడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు నవ్వుతూ ఈడీ ఆఫీస్ లోకి వెళ్లిన కవిత రాత్రి 9 గంటలకు అదే నవ్వుతో తిరిగి బయటకు వచ్చారు. అనంతరం కారులో ఎక్కి విజయ చిహ్నం చూపిస్తూ వెళ్తుండగా.. గుమ్మడికాయతో ఆమెకు దిష్టి కూడా తీశారు.
అయితే ఇవాళ్టితో ఆమె విచారణ పూర్తి అవుతుందన్న తరుణంలో ఈడీ అధికారులు ఈరోజు మళ్లీ విచారణకు రావాలని పిలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆమె ఇవాళ్టి విచారణకు ముందు మీడియా సమావేశం పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఆమె తన ఫోన్ ను మీడియాకు చూపించబోతున్నారని తెలుస్తుంది. అయితే కవిత ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. నిన్నటి ఈడీ విచారణపై ఏమైనా మాట్లాడతారా? నేటి విచారణ హాజరు గురించి ఏమైనా చెప్పదలచారా అనేది చూడాల్సి ఉంది.
తనను నిందితురాలిగా పిలిచారా?
ఈడీ అధికారులు కవితను 10 గంటల పాటు 14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నా..సహాయ నిరాకరణగా చిత్రీకరించే కుట్ర జరుగుతుందని..ఇప్పటివరకు ఎవరితో కలిపి విచారించలేదని తెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని కవిత ఈడీకి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయ ఒత్తిడితో ఈడీ పారదర్శకత లోపించిందని..ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈడీ అధికారులు రాజకీయ కోణంలోనే ప్రశ్నలన్నీ సంధించినట్లు తెలుస్తుంది. నన్ను నిందితురాలిగా పిలిచారా? అని ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తుంది. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాని..సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉండగా..ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించినట్లు తెలుస్తుంది. గత విచారణలో స్వాధీనం చేసుకున్న ఫోన్ చెక్ చేసుకోవచ్చని ఆమె తెలిపినట్లు తెలుస్తుంది.
తను ఫోన్ ధ్వంసం చేసినట్టు మీడియాకు ఎవరు లీకులు ఇచ్చారని ఈడీ అధికారులను ఎమ్మెల్సీ కవిత అడిగినట్లు తెలుస్తుంది. కొందరు బీజేపీలో చేరాక మరుగునపడ్డ కేసుల గురించి కవిత ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత సుమారు గంటసేపు వరకు అధికారుల కోసం వెయిట్ చేసినట్లు..అప్పటివరకు ఆమె ఒంటరిగానే కూర్చోబెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana