ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పిల్లలను సాంకేతికతకు దూరంగా పెంచడం చాలా కష్టమైన అంశంగా మారింది. ఈ రోజుల్లో పెద్దవాళ్లకంటే పిల్లలే ఎక్కువ సమయం ఇంటర్నెట్‌ను వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని రకాల సైకలాజికల్ మొబైల్ గేమ్స్ ఆడి ప్రాణాలు తీసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని కట్టడి చేయడం అసాధ్యమైన నేపథ్యంలో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ కొత్త పీచర్‌తో ముందుకు వస్తోంది. దీని సాయంతో యాప్‌లో పిల్లలు చూడాల్సిన కంటెంట్‌ను పెద్దవాళ్లు నియంత్రించవచ్చు. సూపర్‌వైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ పేరుతో ఈ ఫీచర్‌ను యూట్యూబ్ అభివృద్ధి చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త ఫీచర్ ద్వారా యూట్యూబ్‌లో పిల్లలు చూసే వీడియో కంటెంట్‌ను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ కిడ్స్ పేరుతో యాప్ ఉంది.
ఇది కాకుండా ఇతర యూట్యూబ్ వీడియోల్లో వారు చూడగల కంటెంట్‌ను కొత్త ఫీచర్‌తో ఫిల్టర్ చేయవచ్చు. వయసుకు తగ్గట్టు వీడియోలను ఫిల్టర్ చేసి, కొన్నింటికి మాత్రమే పిల్లలకు యాక్సెస్ ఇవ్వవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్‌లో పరీక్షించనున్నారు. ట్రయల్స్ తరువాత దీన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
మూడు విభాగాలుగా కంటెంట్ కొత్త ఫీచర్ సాయంతో మొత్తం కంటెంట్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు. వీటిల్లో పిల్లలు చూడగలిగే వాటికి ప్రత్యేకంగా పెద్దవాళ్లు యాక్సెస్ ఇవ్వవచ్చు. యూట్యూబ్ అకౌంట్‌లో ఈ ఫిల్టర్‌ను సెట్ చేసి పిల్లలకు ఫోన్ ఇస్తే సరిపోతుంది. కొత్త ఫీచర్ మొత్తం కంటెంట్‌ను ఎక్స్‌ప్లోర్, ఎక్స్‌ప్లోర్ మోర్, మోస్ట్ ఆఫ్ యూట్యూబ్ పేరుతో.. మొత్తం మూడు వర్గాలుగా ఫిల్టర్ చేస్తుంది. ఎక్స్‌ప్లోర్ విభాగాన్ని తొమ్మిది, అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు యాక్సెస్ చేయవచ్చు. దీంట్లో వ్లాగ్స్, ట్యుటోరియల్స్, గేమింగ్ వీడియోలు, మ్యూజిక్ క్లిప్‌లు, వార్తలు, చదువులకు సంబంధించిన సమాచారం.. వంటివి ఉంటాయి.
ఎక్స్‌ప్లోర్ మోర్ విభాగాన్ని 13, అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు చూడవచ్చు. దీంట్లో పిల్లలు అదనంగా లైవ్ స్ట్రీమింగ్, మరికొన్ని రకాల వీడియోలు చూడవచ్చు. మోస్ట్ ఆఫ్ యూట్యూబ్ విభాగంలో అడల్ట్ కంటెంట్ (ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్) తప్ప మిగతా వీడియోలన్నీ చూడవచ్చు.
సమర్థంగా పనిచేస్తుందా?
ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను యూట్యూబ్ అధికారికంగా వెల్లడించలేదు. దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ స్క్రీనింగ్ అన్ని రకాల వీడియోలను సమర్థంగా ఫిల్టర్ చేసే అవకాశాలు తక్కువని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. యూట్యూబ్ కిడ్స్ యాప్‌లో ఉన్న ఫీచర్లు కూడా కంటెంట్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదని గుర్తు చేస్తున్నారు. ఒక బేసిక్ ఫీచర్‌గా దీన్ని యూట్యూబ్ అకౌంట్‌లో సెట్ చేయవచ్చు. అందుబాటులోకి వచ్చిన తరువాతే దీని పనితీరు గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube