డిజిటల్ వెల్బీయింగ్... ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఆన్లైన్లో పడి ఎన్ని గంటల సమయాన్ని వృథా చేస్తున్నారో లెక్కే ఉండదు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్... ఇలా ఎన్నో సోషల్ మీడియా యాప్స్‌లో గంటలు గంటలు సమయాన్ని గడిపేస్తుంటారు. అయితే ఏ యాప్ ఎంత సేపు చూశారో లెక్క ఉండదు కాబట్టి ఎంత సమయం వృథా అవుతుందో తెలుసుకోవడం కూడా కష్టం. అందుకే ఆయా కంపెనీలు 'డిజిటల్ వెల్బీయింగ్' మంత్రాన్ని జపిస్తున్నాయి. అంటే యూజర్ల సమయం వృథా కాకుండా చర్యలు తీసుకోవడం అన్నమాట. తమ యాప్‌పై ఎంతసేపు గడిపారో ఆ వివరాలను యూజర్లకు తెలియజేస్తే... ఇంకా కాసేపు చూడాలా వద్దా అన్నది యూజర్లే నిర్ణయించుకుంటారు. అందుకే డిజిటల్ వెల్బీయింగ్లో భాగంగా యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌ని ప్రకటించింది గూగుల్.
యూట్యూబ్ యాప్‌లో మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేస్తే అప్డేటెడ్ మెనూ కనిపిస్తుంది. అందులో 'టైమ్ వాచ్డ్' అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ రోజు, నిన్న, గత వారంలో ఎన్ని గంటలు వీడియోలు చూశారో వివరాలుంటాయి. అంతేకాదు... రోజూ సగటున ఎంతసేపు వీడియోలు చూశారో తెలుస్తుంది. డిజిటల్ వెల్బీయింగ్లో భాగంగానే ఈ ఫీచర్ ప్రవేశపెట్టినట్టు గూగుల్ చెబుతోంది. అంతేకాదు... తన బ్లాగ్‌లో కొన్ని టిప్స్ కూడా ఇస్తోంది. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో ఎక్కువగా వీడియోలు చూస్తున్నట్టు అనిపిస్తే "రిమైండ్ యువర్సెల్ఫ్ టు టేక్ ఎ బ్రేక్" అనే ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎన్ని నిమిషాలకు విరామం తీసుకోవాలో టైమ్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు యూట్యూబ్ నోటిఫికేషన్లను మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సౌండ్స్, వైబ్రేషన్స్ డిసేబుల్ చేసుకోవచ్చు. సో... ఇకపై యూట్యూబ్‌లో వీడియోలు ఎక్కువగా చూడాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉందన్నమాట.
Published by:Santhosh Kumar S
First published:August 28, 2018, 12:54 pm