భారత్‌కు చెందిన వీడియో ఈ-కామర్స్ ప్లాట్ ఫాం, స్టార్టప్ అయిన ‘సిమ్‌సిమ్’ను (simsim) యూట్యూబ్ హస్తగతం చేసుకుంది. ఈ విషయాన్ని యూట్యూబ్ తమ బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. సిమ్ సిమ్ అనేది ఓ షార్ట్ వీడియో బేస్డ్ షాపింగ్ ప్లాట్ ఫాం. వీడియోల ద్వారా ఉత్పత్తులకు ప్రమోషన్ అందించి వాటి అమ్మకానికి మార్గం కల్పిస్తుంది. ఈ కొనుగోలు ద్వారా చిన్న వ్యాపారాలను, రిటైలర్లను కొత్త కస్టమర్ల వద్దకు చేర్చేందుకు సహకరిస్తామని యూట్యూబ్ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి సిమ్ సిమ్ యాప్ ఇంతకుముందులాగే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. పాత ఆఫర్లను యూట్యూబ్ తన యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తుందని పోస్ట్‌లో వెల్లడించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, స్టార్టప్‌ను ఎంత ధరకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం యూట్యూబ్ వెల్లడించలేదు.
సిమ్ సిమ్ ప్లాట్ ఫాం వీడియోల ద్వారా షాపింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. క్రియేటర్లు వివిధ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు రూపొందిస్తారు. వాటిని చూసిన వ్యూయర్స్.. ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తారు. ఇవి లోకల్ బిజినెస్‌ల నుంచి వారికి డెలివర్ అవుతాయి. వీడియోల ద్వారా ఈ- కామర్స్ అమ్మకాలు ఈ మధ్య కాలంలో పాపులర్‌గా మారుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ తరహా అమ్మకాలను ఎంచుకుంటున్నాయి. ఫైర్ వర్క్ అనే సంస్థ కూడా ఈ రంగంలో బాగా రాణిస్తోంది.
సాధారణంగా చిన్న సంస్థలు ఆన్ లైన్ లో తమ ఉత్పత్తులను అమ్మడానికి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు మంచి ప్లాట్ ఫాంలుగా ఉపయోగపడతాయి. వీటి లాగానే యూట్యూబ్ కూడా ఆన్ లైన్ వీడియో కామర్స్ ప్లాట్ ఫాంని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని సిమ్ సిమ్ కొనుగోలు ద్వారా గుర్తించవచ్చు.
ఈ ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఎక్కువగా వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. సిమ్ సిమ్ ద్వారా వీడియో షాపింగ్ ప్రమోషన్ గురించి ఇప్పటికీ యూట్యూబ్ వెల్లడించలేదు. అయితే స్టార్టప్‌ను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని. వచ్చే కొన్ని వారాల్లో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తవుతాయని మాత్రమే ఆ సంస్థ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube