మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows) ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్నిప్పింగ్ టూల్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టూల్‌ని ఉపయోగించి ఓపెన్ విండో, రెక్టాంగులర్ ఏరియాస్, ఫ్రీ-ఫాం ఏరియా లేదా మొత్తం స్క్రీన్‌ను స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఈ స్క్రీన్‌షాట్‌లను ఇమేజ్ ఫైల్ (PNG, GIF, JPEG) లేదా MHTML ఫైల్‌గా స్టోర్ చేసుకోవచ్చు. ఇమేజ్‌లలోని సెలక్టెడ్ పార్ట్స్‌ని క్యాప్చర్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ఉపయోగపడుతుంది. లేటెస్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా ఈ టూల్ ఉంది. అయితే ఇప్పుడు స్నిప్పింగ్ టూల్ ప్రైవసీకి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ స్నిప్పింగ్ టూల్‌లో ఓ బగ్‌ను కనుగొన్నారు.
ఇటీవల గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల స్క్రీన్‌షాట్ టూల్‌లో సమస్యల గురించి విన్నాం. దీనిని aCropalypse అని పిలుస్తారు. అంటే వినియోగదారులకు తెలియకుండానే స్క్రీన్‌షాట్‌ల ద్వారా ఇన్ఫర్మేషన్ బహిర్గతం అవుతోంది. విండోస్ 11లోని స్నిప్పింగ్ టూల్‌లో కూడా ఇదే రకమైన సమస్య ఉన్నట్లు గుర్తించారు. స్క్రీన్‌షాట్ ఇమేజ్‌లను ఎడిట్ చేసిన తర్వాత ఇతరులు అన్‌డూ చేయడం ద్వారా తిరిగి ఇన్‌ఫర్మేషన్ పొందే అవకాశం ఉండటాన్ని aCropalypse అంటారు.
స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేసినప్పుడు, దానిని ఓవర్‌రైట్ చేస్తూ ఒరిజినల్ ఫైల్‌తో అదే పేరుతో సేవ్ చేయవచ్చు. ఇలా చేసినప్పటికీ విండోస్ 11 స్నిప్పింగ్ టూల్ ఫైల్ నుంచి ఒరిజినల్ ఇన్‌ఫర్మేషన్‌ను డిలీట్ చేయడం లేదని గుర్తించారు. యూజర్ల కంటికి ఫైల్ కనిపించకపోయినా డిలీట్ కావడం లేదు. ఫలితంగా సామర్థ్యం ఉన్న హ్యాకర్లు ఫైల్ నుంచి హిడెన్ ఇన్‌ఫర్మేషన్‌ని తిరిగి పొందవచ్చు. దీంతో యూజర్ల డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌తో అనేక ప్రయోజనాలు.. ఓ లుక్కేయండి!
పిక్సెల్ ఫోన్లకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిన నేపథ్యంలో, విండోస్ 11లో కూడా అదే జరుగుతోందని ట్విట్టర్ యూజర్ క్రిస్ బ్లూమ్ ట్వీట్ చేశారు. అనంతరం డేవిడ్ బుకానన్ (పిక్సెల్ ఫోన్‌లలోని సమస్యలను గుర్తించిన బ్లాగ్ పోస్ట్‌ను రాశారు) విండోస్ 11 స్నిప్పింగ్ టూల్‌లోని ప్రాబ్లమ్స్‌ను నిర్ధారించారు. ఈ సమస్యను ఫైల్ సైజ్ చెక్ చేయడం ద్వారా వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఎడిట్ చేసిన ఫైల్ సైజ్‌ని గమనిస్తే ఒరిజినల్ ఫైల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రీప్లేస్ చేసిన తర్వాత ఒరిజినల్ ఫైల్ డిలీట్ కాలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది.
* బగ్‌తో సమస్య ఇదే..
షేర్ చేయాలనుకుంటున్న ఫోటోలలోని సెన్సిటివ్ ఇన్‌ఫర్మేషన్ ఈ సమస్య ద్వారా లీక్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెజాన్‌లో ఆర్డర్ కన్‌ఫర్మేషన్ పేజీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తే, అందులో అడ్రస్ ఉండవచ్చు, దానిని ఎడిట్ చేసినప్పటికీ, ఇతరులు అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఇతర సున్నితమైన డేటా వంటివి కూడా రిస్క్‌లో పడేస్తాయి.
అయితే ఈ బగ్ హ్యాకర్‌ని పూర్తి ఇమేజ్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించదని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొంది. కంపెనీ సమస్య గురించి తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్లను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Microsoft, Tech news, Windows 11