టెలికాం ఆపరేటర్లు "నెలవారీ" ప్రీపెయిడ్ ప్లాన్లను 30 రోజులకు కాకుండా 28 రోజులకు ఆఫర్ చేస్తుంటాయి. అయితే, సాధారణంగా నెల అంటే 30 రోజులుగా లెక్కస్తారు. కానీ, 28 రోజులకు మాత్రమే వ్యాలిడిటీ ఎందుకు అందిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద కథే ఉంది. ఇలా కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో నెలవారీ ప్లాన్‌ను అందించడం ద్వారా ఏడాదిలో 12కు బదులు 13 సార్లు రీఛార్జ్ చేసు కోవాల్సి వస్తుంది. తద్వారా, ప్రతి కస్టమర్ ఒక నెల రీఛార్జ్ మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల టెలికాం ఆపరేటర్లు పెద్ద మొత్తంలోనే ఆర్జిస్తున్నాయి. ఎలాగో తెలుసుకుందాం.
13వ సారి రీఛార్జ్ ద్వారా కోట్లలో ఆదాయం..
సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు అనగా 365 రోజులు ఉంటాయి. కానీ, నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లతో కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే వస్తుంది. దీన్ని 12 నెలలకు మారిస్తే 336 రోజులు అవుతాయి. అంటే 365 రోజుల కంటే 29 రోజులు తక్కువ అన్నమాట. ఈ 29 రోజులకు మరోసారి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరంలో 12 నెలలు మాత్రమే ఉండగా.. 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇలా, కస్టమర్లు అదనంగా ఒక నెల రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ప్రముఖ టెలికాం సంస్థలు ఎంత ఆర్జిస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పుదు. 13వ సారి రీఛార్జ్ చేసేకుకోవడం ద్వారా ఏటా రూ.కోట్లలో ఆర్జిస్తున్నాయి. 2021 సెప్టెంబర్ వరకు అందరికంటే అధికంగా రిలయన్స్ జియో రూ. 6.168 కోట్లను, ఎయిర్టెల్ రూ. 5,415 కోట్లను, వొడాఫోన్ ఐడియా రూ.2,934 కోట్లను ఈ 13వ రీఛార్జ్ ద్వారా సంపాదించాయి. కేవలం, ఒక నెల ప్లాన్‌కు మాత్రమే కాకుండా మూడు నెలల ప్లాన్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.
టెలికాం ఆపరేటర్లు 90 రోజులకు బదులు 84 రోజుల వ్యాలిడిటీతోనే ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా ఏటా నాలుగు సార్లు రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు మాత్రమే సర్వీస్ వ్యాలిడిటీ లభించనుంది. మిగిలిన 29 రోజులకు ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ టారిఫ్‌లను పెంచడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. దాదాపు 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచడంతో కస్టమర్లపై సంవత్సరానికి రూ. 500 వరకు అదనపు భారం పడనుంది. పెరిగిన కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airtel recharge plans, Recharge, Telecom