Whatsapp: టెక్ దిగ్గజం మెటా(Meta)కు చెందిన వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇతర సంస్థలకు అందనంత ఎత్తులో వాట్సాప్ నిలుస్తుందంటే, అందుకు కారణం ఈ పోర్టల్ అందిస్తున్న సరికొత్త స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. వాట్సాప్ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన గ్రూప్ ఆడియో కాల్స్, క్విక్ రియాక్షన్స్, డిజిటల్ అవతార్ వంటి సరికొత్త ఫీచర్లతో వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. ఈ క్రమంలో కంపెనీ మరో కొత్త స్పెసిఫికేషన్‌పై పరిశోధన చేస్తోంది. టెక్స్ట్ చాట్ మాదిరిగా ఆడియో చాట్ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేస్తోంది.
వాట్సాప్‌లో ఇప్పటికే వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. వాయిస్ నోట్ సెండ్ చేసే ఫీచర్ కూడా ఉంది. అయితే త్వరలో వాయిస్ చాట్ కోసం స్పెషల్ విండోను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.7.12 బీటాలో ఈ ఫీచర్ అందుబాటులో ఉందని వాట్సాప్ బీటా ఇన్‌ఫో (WaBetaInfo) పేర్కొంది. ఈ ఆడియో చాట్ ఆప్షన్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. దీంతో ఇది ఎలా పనిచేస్తుందనే వివరాలు ప్రస్తుతానికి పూర్తిగా తెలియదు.
* బీటా అప్‌డేట్ వివరాలు..
వాట్సాప్ ఆడియో చాట్ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను వాట్సాప్ బీటా ఇన్‌ఫో షేర్ చేసింది. వీటిలో చాట్ హెడర్ వద్ద ఈ ఫీచర్‌కు సంబంధించిన ఐకాన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని క్లిక్ చేస్తే స్పెషల్ ఆడియో చాట్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ స్పెసిఫికేషన్ కేవలం గ్రూప్ చాట్స్‌లోనే ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు వాయిస్ కాల్స్ ఎండ్ బటన్ ఒక పక్కకు ఉన్నట్లు స్క్రీన్‌షాట్స్‌లో కనిపిస్తోంది. దీంతో వాయిస్ చాట్స్ రన్ అవుతున్నప్పుడు వేవ్‌ఫారమ్స్ కనిపించేలా తగినంత స్పేస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాట్ హెడర్ దగ్గర ఇందుకు స్పేస్ ఉంటుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వేవ్‌ఫారమ్స్ లైవ్‌లోకి వస్తే.. యూజర్లు సంభాషణ చేస్తున్నప్పుడు రియల్ టైమ్ ఆడియో విజువలైజేషన్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఆడియో విజువలైజేషన్ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. యూజర్లు సంభాషణ చేస్తున్నప్పుడు ఆడియో వేవ్‌ఫారమ్‌లు చూసేందుకు వినియోగదారులకు మినిమలిస్టిక్ ఇంటర్‌ఫేస్‌ను వాట్సాప్ అందిస్తుంది. ఇతర యుటిలిటీ ఫంక్షన్స్ కోసం డెవలపర్లు మిగిలిన స్పేస్‌ను వాడనున్నట్లు స్క్రీన్‌షాట్స్ ద్వారా తెలుస్తోంది.
ITR Filing: ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోగా ఫైల్ చేయాలి? ఐటీఆర్ ఫారమ్స్ ఎన్ని రకాలు..?
* ముందు ఆండ్రాయిడ్‌లో..
ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందు ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే తీసుకురానున్నారు. టెస్టింగ్ తర్వాత iOSకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని భావిస్తున్నారు. అయితే ఈ అప్‌డేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వాట్సాప్ బీటా ఇన్‌ఫో వెల్లడించలేదు. దీంతో వాట్సాప్ యూజర్లు ఆడియో చాట్ ఫీచర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Whatsapp