పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) రోజుకో కొత్త ఫీచర్‌ను(New Feature) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తద్వారా తన యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌పై పనిచేస్తుంది. త్వరలోనే వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్(Desktop Version) కోసం గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత వాట్సాప్ వెబ్ బీటా వెర్షన్ యూజర్లకు దీన్ని తీసుకురానుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లందరికీ పరియం చేయనుంది. కాగా, ఈ ఫీచర్ కొన్ని వారాల క్రితమే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీరు మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇప్పటికే కొత్త బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఈ కొత్త ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు.
WAbetainfo ప్రకారం, గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ ఫీచర్ కేవలం వాట్సాప్ వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినవచ్చు. వేరే చాట్ విండోలోకి యూజర్ మారినా సరే వాయిస్ నోట్ ప్లే అయ్యేలా ఈ ఫీచర్‌ను రూపొందించనుంది.
వేరే చాట్ విండోలోకి మారినా బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ నోట్ వినొచ్చు..
గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ ఫీచర్‌తో మీరు చాట్ లిస్ట్ దిగువన కొత్త ఆడియో ప్లేయర్‌ని కూడా పొందుతారు. ప్లేయర్ ఎడమ వైపు మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా కనిపిస్తుంది. తద్వారా, వాయిస్ నోట్ పంపిన వారిని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని పరీక్షించడానికి, మీరు వాట్సాప్ వెబ్ బీటా వెర్షన్ 2.2204.4.1 లేదా 2.2204.5 కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి. వాట్సాప్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. టెస్టింగ్‌లో ఏవైనా బగ్స్ గుర్తిస్తే.. వాటిని పరిష్కరించిన తర్వాత రాబోయే నెలల్లో ఫీచర్‌ను విడుదల చేయనుంది.
వాట్సాప్ వెబ్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. వాట్సాప్ వెబ్ ద్వారా మీ పీసీలో ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఫోటోలను ఇతరులతో పంచుకోవచ్చు, వాయిస్ నోట్స్‌ని కూడా వినవచ్చు. వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడానికి మీరు లింక్ చేసిన మొబైల్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. కానీ, స్మార్ట్‌ఫోన్‌తో లింకప్ లేకుండానే వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేలా త్వరలోనే కొత్త అప్డేట్ రానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో వాయిస్ కాల్స్ చేసే సామర్థ్యాన్ని కూడా తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తోంది. ఈ అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తే వాట్సాప్ వెబ్ యూజర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.