ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాట్సాప్ ప్రకటించిన నూతన ప్రైవసీ పాలసీ విధానం వివాదాస్పదమైంది. దీంతో చాలా మంది యూజర్లు వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ యాప్స్‌కు మారుతున్నారు. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు దిద్దబాటు చర్యలకు దిగిన వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాన్ని వాయిదా వేసింది. యూజర్ల డేటాకు ఎటువంటి భంగం వాటిల్లదని ప్రకటించింది. ఇక, ఈ విషయం పక్కన పెడితే.. మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌ను ఉన్న డిమాండ్ ఇప్పటికీ అస్సలు తగ్గలేదు. ఇది ఇప్పటికీ పాపులర్ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్డేట్స్కు చేర్చడమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే, వాట్సాప్‌ను సాధారణంగా మెసేజెస్ పంపుకోవడానికి, కాల్స్ చేసుకోవడానికి, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. వాట్సాప్‌ను వ్యక్తిగత డైరీగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఒక చిన్న ట్రిక్ ద్వారా, మీరు మీ వాట్సాప్స్ను డైరీగా ఉపయోగించుకొని మీ ముఖ్యమైన మెసేజెస్, ఫోటోలు, ఫైళ్ళను భద్రపర్చుకోవచ్చు. అలాగో చూడండి.
మీతో మీరే చాట్ చేసుకోవచ్చు..
మనం ఏవైనా ముఖ్యమైన మెసేజెస్ను, పాస్‌వర్డ్‌లను లేదా వెబ్సైట్ లింక్‌లను సేవ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాటిని, మన పరిచయస్తుల్లో ఎవరికైనా పంపుతుంటాం. తద్వారా ఆయా మోసేజెస్ను ఎప్పుడైనా చూసుకోవచ్చనుకుంటాం. అయితే, ఈ విధానం ద్వారా మీ వ్యక్తిగత వివరాలు అవతలి వ్యక్తికి వెళ్తాయి. తద్వారా భవిష్యత్‌లో మీ డేటాకు భద్రత లోపించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా మీ మెసేజెస్ను మీరు తప్ప మరెవరూ చూసుకోలేరు. ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో తెలుసుకుందాం.
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
1. ముందుగా, మీరు మీ మొబైల్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
2. wa.me// ను ఓపెన్ చేసి మీ కంట్రీ కోడ్‌తో సహా మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. ఉదాహరణకు, మీ వాట్సాప్ నంబర్ 9999119999 అయితే, +919999119999ను నమోదు చేయండి.
3. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘కంటిన్యూ చాట్’ ఆప్షన్లపై క్లిక్ చేయండి.
4. దీంతో నేరుగా మీ వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్వంత మొబైల్ నంబర్ కన్పిస్తుంది.
5. ఇక్కడ మీరు సాధారణ చాట్ మాదిరిగానే టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు లేదా ఫైళ్ళను పంపుకునే అవకాశం ఉంటుంది.
6. దీనిలో మీరు మీ చాట్‌ను పిన్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా, మీరు ఎప్పుడైనా ఏదైనా నోట్ చేసుకోవాల్సి వచ్చినవప్పుడు ఈ చాట్‌లో రాసుకొని డైరీలా ఉపయోగించుకోవచ్చు.