చాలా కంపెనీల లాగే వాట్సాప్ కూడా... బీటా వెర్షన్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా ఇన్-యాప్ బ్రౌజర్, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్లను తెస్తోంది. ఇన్-యాప్ బ్రౌజర్ ద్వారా మీరు... వాట్సాప్‌లో ఉంటూనే వెబ్ సైట్ల పేజీలను ఓపెన్ చెయ్యవచ్చు. ఇప్పుడైతే వాట్సాప్‌లో లింక్ క్లిక్ చెయ్యగానే... వాట్సాప్ నుంచీ బయటకు వెళ్లిపోయి... ఆ లింక్ ఓపెన్ అయ్యే సైట్లోకి వెళ్తున్నాం. అదే ఇన్-యాప్ బ్రౌజర్ ఆప్షన్ అమల్లోకి వస్తే, లింక్ క్లిక్ చేసినప్పుడు వాట్సాప్ క్లోజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఆ లింక్ సంబంధిత వెబ్ సైట్ కూడా వాట్సాప్‌లోనే ఇన్-యాప్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ ఆన్‌లో ఉన్నప్పుడు మనం స్క్రీన్ షాట్లు, స్క్రీన్ రికార్డ్ మాత్రం చేసుకోలేం. ఇన్-యాప్ బ్రౌజర్ వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. ఇది ప్రమాదకరమైన లింక్‌ను ఓపెన్ కానివ్వకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా హ్యాకర్లు పంపే లింకులు ఓపెన్ అవ్వవు. మన మొబైల్ హ్యాక్ అవ్వదు. అందువల్ల ఈ ఫీచర్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటూ... మనం చేసిన బ్రౌజింగ్ హిస్టరీ కూడా ఎవరికీ తెలియకుండా చేస్తుంది ఈ న్యూ ఫీచర్.
ప్రతీకాత్మక చిత్రం
రెండో ఫీచర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్. ఇప్పటివరకూ మనం గూగుల్ ఇమేజెస్‌లో ఓ ఇమేజ్‌ని అప్లోడ్ చేసి... సెర్చ్ చేస్తే... ఆ ఇమేజ్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని చూపిస్తోంది. అదే విధంగా వాట్సాప్‌లో కూడా ఎవరైనా మీకు పంపిన ఇమేజ్ కొత్తగా, పాతదా అన్నది తెలుసుకోవచ్చు. అది నిజమైనదా, నకిలీదా, మార్ఫింగ్ చేసినదా అన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇమేజ్‌ని వాట్సాప్‌లో ఉండే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ద్వారా సెర్చ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈమధ్య వాట్సాప్‌లో వివాదాస్పద ఫొటోలు లేనిపోని గొడవలకు దారితీస్తున్నాయి. ఒక్కోసారి మూక దాడులు, హత్యలకు కూడా కారణమవుతున్నాయి. ఇక మార్ఫింగ్ ఫొటోలతో జరుగుతున్న దారుణాలకు లెక్క లేదు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇలాంటి నాటకాలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం మనకు అందుబాటులో లేవు. ఆండ్రాయిడ్ 2.19.74 వాట్సాప్ బీటా వెర్షన్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ప్రయోగ దశలో ఇవి వంద శాతం సక్సెస్ అయితే, వీటిని అమల్లోకి తెస్తుంది. అప్పుడు మనం వాటిని వాడుకోవచ్చు. ఐతే, అది ఎప్పుడన్నది ఇంకా డేట్ చెప్పలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.