Home /News /technology /

WHATSAPP PRIVACY POLICY ONLY 18 PERCENT INDIAN USERS MAY CONTINUE AND 36 PERCENT TO REDUCE USAGE DRASTICALLY SK GH

WhatsApp privacy policy: భారత్‌లో వాట్సాప్ ఖేల్‌ఖతమేనా? జనం ఏమంటున్నారు? సంచలన సర్వే


(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp privacy policy: ప్రైవసీ పాలసీ ఉదంతం తరువాత కేవలం 18 శాతం మంది వినియోగదారులు మాత్రమే వాట్సాప్ వాడకాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాట్సాప్ వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తామని మరో 36 శాతం మంది చెప్పారు.

దిగ్గజ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్‌కు కష్టాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీస్ రూల్స్‌ను కస్టమర్లు పాటించాల్సిందేనని ఈ నెలలో వాట్సాప్ యూజర్లను ఆదేశించడంతో.. ఈ సంస్థపై వినియోగదారులు కోపంతో ఉన్నారు. చాలామంది వినియోగదారులు సిగ్నల్ యాప్, టెలిగ్రామ్ వంటి వాటికి మారుతున్నారు. వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్ వాటా ఉన్న ఇండియాలో ఆ సంస్థపై వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారని తాజా సర్వే చెబుతోంది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ (Local Circles) భారత్‌లోని 244 జిల్లాల నుంచి 8,977 మందిపై చేసిన ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ప్రైవసీ పాలసీ ఉదంతం తరువాత కేవలం 18 శాతం మంది వినియోగదారులు మాత్రమే వాట్సాప్ వాడకాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాట్సాప్ వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తామని మరో 36 శాతం మంది చెప్పారు. 15 శాతం మంది వినియోగదారులు మాత్రం వాట్సాప్‌ను వాడేది లేదని తెగేసి చెప్పారు.

ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ ఇటీవల కొత్త సర్వీస్ రూల్స్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు వినియోగదారులు వాట్సాప్‌ను వాడాలంటే కాంటాక్ట్ నంబర్, ఇతర వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు అంగీకరించాల్సి ఉంటుందని కస్టమర్లకు నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. అప్పటిలోపు కొత్త నియమాలకు వినియోగదారులు అంగీకారం తెలపాలని కస్టమర్లకు వాట్సాప్ తెలియజేసింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ గడువును మే 15 వరకు పొడిగించింది.

వేరే యాప్‌లకు వలస
సర్వేలో పాల్గొన్న వారిలో 24 శాతం మంది వినియోగదారులు వేరే ప్లాట్‌ఫాంలకు మారాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ వివరాలను ఫేస్‌బుక్‌, ఇతర థర్డ్ పార్టీలతో పంచుకుంటే, వాట్సాప్ పేమెంట్ సిస్టమ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడమని 91 శాతం వాట్సాప్ యూజర్లు చెప్పారు. విమర్శల నేపథ్యంలో భారత్‌లో వాట్సాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య 35 శాతం తగ్గింది. జనవరి 1-5 మధ్య 2 మిలియన్లుగా ఉన్న డౌన్‌లోడ్లు జనవరి 6-10 వరకు 1.3 మిలియన్లకు తగ్గాయి. దీంతోపాటు ఇతర మెస్సేజింగ్ యాప్‌ల డౌన్‌లోడ్‌లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 1- 5 మధ్య సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్‌లు 24,000 నుంచి జనవరి 6-10 వరకు 2.3 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్‌లు 1.3 మిలియన్ల నుంచి 1.5 మిలియన్ల వరకు చేరుకోవడం విశేషం.

ప్రమాదం లేదంటున్న వాట్సాప్
భారతదేశంలో ప్రస్తుతం 400 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ యాప్‌ను వాడుతున్నారని అంచనా. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం వాట్సాప్ నుంచి 60 మిలియన్ల మంది యూజర్లు ఇతర ప్రత్యామ్నాయ మెస్సేజింగ్ యాప్‌లకు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త నియమాల వల్ల వినియోగదారుల డేటాకు ఎలాంటి ప్రమాదం ఉండదని వాట్సాప్ చెబుతోంది. యూజర్ల డేటాను, మెస్సేజ్‌లను, షేరింగ్ లొకేషన్లను వాట్సాప్ లేదా ఫేస్‌బుక్‌లు చూడవని, కాల్స్‌ను వినవని ప్రకటించింది. యూజర్ల కాల్స్, మెస్సేజ్‌ల లాగ్స్‌ను కూడా వాట్సాప్‌ చూడదని ఆ సంస్థ తెలిపింది. యూజర్ల కాంటాక్ట్స్‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమని, వాట్సాప్ గ్రూపులు ప్రైవేట్‌గా ఉంటాయని వెల్లడించింది.

బిజినెస్ అకౌంట్లపై ప్రభావం
కొత్త రూల్స్ కారణంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లను వినియోగించేందుకు ఆసక్తి చూపట్లేదని 67 శాతం మంది కస్టమర్లు చెప్పారు. లావాదేవీల వివరాలు, ఇన్‌వాయిస్‌లు, వోచర్లు... వంటి వాటిని వినియోగదారులతో పంచుకునేందుకు కొన్ని సంస్థలు వాట్సాప్ బిజినెస్ అకౌంట్లను ఉపయోగిస్తున్నాయి. చిన్న బిజినెస్ యూనిట్లు కూడా తమ వినియోగదారులతో మాట్లాడటానికి, ఆర్డర్లు తీసుకోవడానికి, వస్తువులను సరఫరా చేయడానికి వాట్సాప్ బిజినెస్ అకౌంట్లను ఉపయోగిస్తాయి. కానీ పేమెంట్, ట్రాన్సాక్షన్స్ వివరాలను ఫేస్‌బుక్‌, ఇతర థర్డ్ పార్టీలతో వాట్సాప్ పంచుకుంటుందనే అనుమానాలతో బిజినెస్ అకౌంట్లను వాడేందుకు సంస్థలు, కస్టమర్లు ఆసక్తి చూపించట్లేదు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Information Technology, Technology, Whatsapp

తదుపరి వార్తలు