WhatsApp: కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో మెసేజింగ్ యాప్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది వాట్సాప్ (WhatsApp). అలానే, ఎప్పటికీ తనకు తానే సాటిగా ఉండేందుకు కొత్త ఫీచర్లను నిత్యం పరిచయం చేస్తోంది. అంతేకాదు, ఆల్రెడీ తీసుకొచ్చిన ఫీచర్లను మెరుగుపరుస్తూ యూజర్లను ఫిదా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డిసప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages) ఫీచర్‌లో కాలపరిమితుల (Durations) సంఖ్యను పెంచేందుకు సిద్ధమైంది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ప్రస్తుతానికి మెసేజ్ టైమర్ సెక్షన్‌లో మూడంటే మూడు వ్యవధులను మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఇందులో 90 రోజులు, 7 రోజులు, 24 గంటలు అనే డ్యూరేషన్స్ ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆయా సమయాలలోగా ఆటోమేటిక్‌గా మెసేజెస్ డిలీట్ చేసుకోవచ్చు.
డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ మెసేజ్‌లను అవతల వ్యక్తి ఫోన్ నుంచే కాకుండా లేదా వాట్సాప్ సర్వర్‌లో శాశ్వతంగా డిలీట్ చేస్తుంది. దీనివల్ల కన్వర్జేషన్లకు ప్రైవసీ పెరుగుతుంది. కాగా ప్రస్తుతానికి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా ఇరువైపులా డిలీట్ అయిపోవడానికి కనీసం 24 గంటలు వెయిట్ చేయక తప్పడం లేదు. దీనివల్ల ప్రైవసీ అనేది ఎక్కువగా ఉండట్లేదు. అదే ఇంకా చాలా తక్కువ సమయంలోనే ఆటోమేటిక్‌గా మెసేజెస్ అన్ని అదృశ్యమైపోతే.. అప్పుడు ప్రైవసీ అనేది మరింత మెరుగుపడొచ్చు. అందుకే వాట్సాప్ ఇప్పుడు గంటల వ్యవధిలోనే మెసేజెస్ డిసప్పియర్ అయ్యేలా కొత్త డ్యూరేషన్స్ తీసుకొస్తోంది. అంతేకాదు, రోజులపరంగా మరీ ఏడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కొత్త డేస్ డ్యూరేషన్స్ కూడా తీసుకొస్తోంది. ఈ కొత్త కాల పరిమితులకు సంబంధించిన వివరాలను స్క్రీన్‌షాట్‌తో సహా వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) రిపోర్ట్ తాజాగా వెల్లడించింది.
ChatGPT: చాట్‌జీపీటీ కారణంగా లేఆఫ్స్ తప్పవా? ఆ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లేనా?
WABetaInfo ప్రకారం, వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌లోని 'మెసేజ్ టైమర్' సెక్షన్‌లో "మోర్ ఆప్షన్స్" అనే కొత్త ఆప్షన్ ఇవ్వడంపై పని చేస్తోంది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కొత్త 15 వ్యవధుల నుంచి టైమ్ లిమిట్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ కొత్త వ్యవధులలో 1 సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 12 గంటలు, 6 గంటలు, 3 గంటలు, 1 గంట ఉన్నాయి. వీటిలో నచ్చిన టైమ్ లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే.. ఆ టైమ్‌లోగా మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి.
పైన చెప్పిన విధంగా వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజ్‌ల కోసం కొత్త సమయ వ్యవధులను ప్రవేశపెడుతోంది. వీటితో మెసేజ్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజర్లు డిలీట్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా సున్నితమైన సమాచారంతో ఉన్న మెసేజ్‌లను త్వరగా డిలీట్ చేసుకొని ప్రైవసీని కాపాడుకోవడానికి 1-గంట వ్యవధి ఉత్తమంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్న ఈ కొత్త అప్‌డేట్ వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నట్లు WABetaInfo తెలిపింది. అయితే దీనిని ఐఓఎస్, ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్‌లలో కూడా పరిచయం చేయొచ్చని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp