మెటా(Meta) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్ తాజాగా విండోస్ డెస్క్‌టాప్ వెర్షన్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌తో(Interesting Feature) ముందుకొచ్చింది. యూజర్లు తమకు తామే మెసేజ్ చేసుకునేందుకు వీలుగా ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ట్రాకర్ waBetaInfo ప్రకారం, విండోస్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి వాట్సాప్ బీటాను ఇన్స్టాల్ చేసుకున్న డెస్క్‌టాప్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.
రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ ప్రకటించింది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్' ఫీచర్‌తో యూజర్లు తమకు తాము టెక్స్ట్‌లు, మీడియా, నోట్లను పంపుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యూజర్లు తమ అకౌంట్‌కు సొంతంగా మెసేజ్‌లను పంపుకోవడానికి wa.me/+91 తర్వాత వారి 10 అంకెల మొబైల్ నంబర్‌ను టైప్ చేసే టెక్నిక్ ఫాలో అవుతున్నారు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్‌లో ఇంపార్టెంట్ ఫైల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.
బీటా యూజర్లకు అందుబాటులోకి..
ఈ ఫీచర్ కోసం వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు మొదటగా తమ కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో Windows 2.2248.2.0 బీటా వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత, వాట్సాప్‌లో పర్సనల్ చాట్‌ను సూచించే సింబల్ కనిపిస్తుంది. ఆ పర్సనల్ చాట్ సింబల్‌పై క్లిక్ చేసి తమకు తామే మెసేజ్‌లను పంపుకోవచ్చు. మెసేజ్‌లను పంపిన ప్రతిసారీ, మీ మొబైల్ నంబర్‌తో లింకైన అన్ని లింక్డ్ డివైజ్‌లకు సదరు మెసేజ్ డెలివరీ అవుతుంది. కాబట్టి, వాటిని ఎప్పుడైనా చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మెసేజ్‌లు కూడా వాట్సాప్‌లోని ఇతర మెసేజ్‌ల వలె ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉంటాయి.
కాగా, ఈ ఫీచర్ గత నెలలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ఫీచర్‌ని ప్రారంభించడానికి ముందు యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయాలి. దీని కోసం గూగుల్ ప్లే స్టోర్/యాపిల్ యాప్ స్టోర్‌కి వెళ్లి తాజా వాట్సాప్ వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
స్టెప్ 1: మీ మొబైల్లోని వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ‘న్యూ చాట్ ఐకాన్’పై క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఐఫోన్లో టాప్ రైట్ కార్నర్, ఆండ్రాయిడ్ ఫోన్లలో బాటమ్‌లో అందుబాటులో ఉంటుంది.
స్టెప్ 3: ఆ తర్వాత మీరు మీ మొబైల్ నంబర్‌తో కూడిన కాంటాక్ట్ కార్డ్‌ని ‘మెసేజ్ యువర్సెల్ఫ్’ పేరుతో కనుగొంటారు.
స్టెప్ 4: కాంటాక్ట్‌పై క్లిక్ చేసి మెసేజ్‌లు, ఫైల్స్ పంపించండి.
మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌తో యూజర్లు తమకు తాముగా మెసేజ్‌లతో పాటు ఫోటోలు, ఆడియోలు, వీడియోలు కూడా పంపుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. అంతేకాదు, యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా డాక్యుమెంట్లు, మీడియాను కూడా షేర్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Whatsapp, Whatsapp tricks